ఆశలన్నీ కడలిపాలు
వేట నిషేధ కాలం ముగిసి ఐదు నెలలు పూర్తయినా టీడీపీ, కూటమి ప్రభుత్వానికి గంగపుత్రుల ఆవేదన మచ్చుకై నా పట్టడం లేదు. సూపర్ సిక్స్‌లో ఒక్కో పథకం కనుమరుగైన విధంగా భరోసా సాయం పథకం కూడా కూటమి ప్రభుత్వం కప్పెట్టేసింది. ఏటా ఏప్రిల్ 14 నుంచి జూన్ 14 వరకు సముద్రంలో మత్స్యకారులకు వేట నిషేధం ఉంటుంది. ఈ సమయంలో వారి కుటుంబాలను ఆదుకునేందుకు వీలుగా ప్రభుత్వం కొంత సాయాన్ని భృతిగా అందజేస్తుంది. కానీ ఈ ఏడాది మాత్రం పథకంపై నీలినీడలు కమ్ముకోవడంతో మత్స్యకారుల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయి. బతుకు దుర్భరంగా మారింది.
చీరాల టౌన్: ‘గంగ పుత్రులంటే నాకు విపరీతమైన ఇష్టం.. ప్రాణాలకు తెగించి వేట సాగిస్తారు.. మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వేట నిషేధ సాయం ఏడాదికి ఒక్కొక్కరికీ రూ.20వేలు ఇస్తా.. డీజిల్ సబ్సిడీ పెంచుతా. పక్కా ఇళ్లు కట్టిస్తా’ అని చీరాల్లో ఎన్నికలకు ముందు జరిగిన సభలో చంద్రబాబు ఇచ్చిన వాగ్దానం. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా నేటికీ వేట నిషేధ సాయం ఇవ్వకుండా మత్య్సకారులకు మొండి చెయ్యి చూపారు. రీ సర్వేల పేరుతో కాలయాపన చేస్తూనే ఉన్నారు. 2024 జూన్‌లో ఇవ్వాల్సిన నిషేధ సాయం నేటికీ ఇవ్వకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని చీరాల, పర్చూరు, బాపట్ల, రేపల్లె, అద్దంకి, వేమూరు నియోజకవర్గాల్లో 53,000 మంది మత్య్సకారులు కాగా ఇందులో సముద్రంలో వేటకు వెళ్లే వారు 16500 మంది ఉన్నారు. అధికారులు ఇప్పటివరకు సర్వేచేసిన సమాచారం మేరకు భరోసాకు ఈ ఏడాది 12,350 మంది లబ్ధిదారులు ఉన్నట్లు గుర్తించారు. వీరిలో కేవలం 10.500 మందిని అర్హులుగా నిర్ధారించారు. వీరికి రూ. 20 వేల చొప్పున రూ. 25 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వేట నిషేధ సమయంలో ఐదేళ్లు క్రమం తప్పకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ ఏడాదికి రూ. 10 వేలు చొప్పున చెల్లిస్తూ వచ్చింది. దీంతో మత్స్యకారులు అవస్థలు పడకుండా వేట నిషేధ సమయాన్ని గడిపేవారు.
పట్టించుకోని ప్రభుత్వం
కూటమి ప్రభుత్వం ఇప్పటికి భృతి మంజూరుపై ఎటువంటి నిర్ణయం ప్రకటించకపోవడంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. అధికారంలోకి వస్తే భరోసా సాయం రూ.10 వేల నుంచి రూ. 20 వేలు పెంచుతామంటూ హామీ ఇచ్చింది. దాన్ని నేటికీ అమలు చేయకపోవడంతో మత్స్యకారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పింఛన్‌దారులు, ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొందుతున్న వారిని జాబితా నుంచి తొలగిస్తారనే అనుమానాలు మత్స్యకారుల్లో ఉన్నాయి.
నేడు అంతర్జాతీయ మత్య్సకార దినోత్సవం
ఎన్నికలకు ముందే అలవికాని హామీలు గుప్పించిన చంద్రబాబు, కూటమి నేతలు అధికారం చేపట్టాక వాటి ఊసే లేదు వేట నిషేధం పూర్తయ్యి ఐదు నెలలు దాటినా దక్కని మత్స్యకార భరోసా సాయం ఐదేళ్లు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న వైఎస్. జగన్ సర్కార్
నిధులు విడుదల కాగానే సాయం
మత్య్సకారులకు వేట నిషేధ సాయం అందించే భరోసా పథకానికి ఇప్పటికే అర్హులను జిల్లాలో గుర్తించాం. ఆరు నియోజకవర్గాల్లో వివరాలను ప్రభుత్వ ఉన్నతాధికారులకు అందించాం. మత్య్సకార భరోసాపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం మాకు రాలేదు. నిధులు విడుదల కాగానే వెంటనే సాయం అందిస్తాం.
– పి.సురేష్, డెప్యూటీ డైరెక్టర్, మత్స్యశాఖ
సముద్రంలో వేట సాగించే మత్య్సకారుల్లో పలువురికి డీజిల్ సబ్సిడీ అందడం లేదు. ఏడాదిలో వేట నిషేధ కాలం రెండు నెలలు మినహాయించి కేవలం 10 నెలలకే డీజిల్ సబ్సిడీ అందిస్తున్నారు. అదికూడా లీటర్‌కు రూ.9లు మాత్రమే ఇస్తున్నారు. దీన్ని రూ.15కి పెంచి అందరికీ నెలకు 500 లీటర్లు ఇవ్వాలని మత్య్సకారులు డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం రిజిస్టర్ బోట్లు ఒక్కోదానికి నెలకు 300 లీటర్లు మాత్రమే డీజిల్ ఇస్తున్నారు. ఇది కేవలం మూడు దఫాలుగా వేట చేసేందుకు ఉపయోగపడుతుందని, తర్వాత వెళ్తే అదనంగా డీజిల్ కొనుగోలు చేయాల్సి వస్తోందని మత్య్సకారులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment