సంక్షామ హాస్టళ్లు
బాపట్ల టౌన్: జిల్లాలో సంక్షేమ హాస్టళ్లు సమస్యలకు నిలయాలుగా మారాయి.మౌలిక వసతులు కరువయ్యాయి. అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల క్రితం నిర్మించిన హాస్టల్ భవనాలు శిథిలావస్థకు చేరాయి.
హాస్టళ్లలో విద్యార్థుల వివరాలు
● జిల్లాలో ఎస్సీ హాస్టల్స్ మొత్తం 27 ఉండాల్సి ఉండగా వాటిల్లో విద్యార్థులు లేక రెండు మూతపడ్డాయి. ప్రస్తుతం రన్నింగ్‌లో ఉన్న 25 వసతి గృహాల్లో 1662 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
● జిల్లాలో మొత్తం ఎస్టీ వసతి గృహాలు 3, ఆశ్రమ, గురుకుల పాఠశాలలు 7 చొప్పున మొత్తం 10 వసతి గృహాలు ఉన్నాయి. వాటిల్లో 1084 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
● బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో మొత్తం 42 వసతి గృహాలు ఉండగా వాటిల్లో 15 విద్యార్థులు లేక మూతపడ్డాయి. ప్రస్తుతం 27 వసతి గృహాల్లో 1170 మంది విద్యార్థులు విధ్యనభ్యసిస్తున్నారు. వాటిల్లో 8 కళాశాల వసతిగృహాలు, 19 పాఠశాలల వసతిగృహాలు ఉన్నాయి.
వసతులు అధ్వానం
● రేపల్లె బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు అధ్వానంగా ఉన్నాయి. తలుపులు లేకపోవడంతో విద్యార్ధులు ఆరుబయటే స్నానాలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎస్సీ బాలుర వసతి గృహంలోని పలు గదుల్లో శ్లాబు పెచ్చులూడి చువ్వలు బయటపడ్డాయి. కిటికీల వద్ద ఏర్పాటు చేసి ఉన్న సన్ సైడ్‌లు పూర్తిగా శిథిలం అవ్వటంతో చిన్నపాటి వర్షానికే నీరు గదుల్లోకి చేరుతోంది. పట్టణంలోని గిరిజన బాలుర కళాశాల వసతి గృహంలో విద్యార్థులు
నానా అవస్థలు పడుతున్నారు. వసతిగృహంలోని కిటికీలకు ఒక్కదానికి కూడా మెస్‌లు లేవు. దీంతో దోమలు విద్యార్థుల కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి.వంటగదిలో చెత్తాచెదారం నిల్వలు పేరుకుపోయి ఉన్నాయి. వసతిగృహంలో మొత్తం 10 మరుగుదొడ్లు ఉండగా వాటిల్లో ఒక్కటి కూడా సక్రమంగా పనిచేయటం లేదు. దీంతో విద్యార్థులు సైకిళ్లపై కిలోమీటర్ల మేరా బహిర్భూమికి వెళ్తున్నారు. నిజాంపట్నం మండలం శింకపాలెం బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
● వేమూరు నియోజకవర్గం చుండూరు బాలుర గురుకుల పాఠశాలలో మరుగుదొడ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారు. భట్టిప్రోలులో ఎస్సీ బాలుర వసతిగృహంలో ఫ్యాన్ల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
● పర్చూరు నియోజకవర్గ పరిధిలోని మార్టూరు మండలంలో బాలికల సంక్షేమ వసతి గృహంలో తాగునీరు సమస్య ఉంది. వలపర్లలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో శ్లాబునుంచి పెచ్చులూడి పడుతున్నాయి. వసతిగృహం అధ్వానంగా ఉంది.
● చీరాలలోని బీసీ బాలుర వసతి గృహాల్లో ఇన్‌చార్జ్ వార్డెన్‌ల పాలన కొనసాగుతోంది. వేటపాలెంలోని బీసీ బాలుర వసతి గృహం రేకుల షెడ్డు కావడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సరిపడా మరుగుదొడ్లు లేకపోవడంతో అగచాట్లు తప్పడం లేదు.
● అద్దంకిలోని బీసీ బాలుర వసతి గృహంలో మరుగుదొడ్లు మరమ్మతులకు గురై నిరుపయోగంగా ఉన్నాయి. భవనం కిటికీల తలుపులు లేకపోవడంతో వర్షపు జల్లులు పడుతున్నాయి. తాగునీటి సౌకర్యం సరిగాలేదు.
సమస్యల చెరలో వసతి గృహాలు విద్యార్థులే వంటమాస్టర్లు, స్వీపర్లు కనీస వసతులు కరువు అస్తవ్యస్తంగా మరుగుదొడ్లు బహిర్భూమికి వెళ్తున్న విద్యార్థులు జిల్లాలో రూ. 3.1 కోట్ల మేర నిలిచిన బకాయిలు
అప్పుల ఊబిలో వార్డెన్లు
గడిచిన ఆరునెలలుగా వార్డెన్లకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3నుంచి 6వ తరగతిలోపు విద్యార్థులకు నెలకు రూ. 1150, 6నుంచి10 తరగతిలోపు విద్యార్థులకు రూ. 1400, ఇంటర్ నుంచి డిగ్రీలోపు విద్యార్థులకు రూ. 1600 చొప్పున చెల్లించాలి. జిల్లాలో మొత్తం 3860 మంది విద్యార్థులు వసతిగృహాల్లో విద్యనభ్యసిస్తున్నారు. సగటున ఒక్కొ విద్యార్థికి నెలకు రూ. 1300 చొప్పున నెలకు రూ. 50.18 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలకు గానూ వార్డెన్లకు ప్రభుత్వం రూ. 3.1 కోట్లను ఇవ్వాలి.
Comments
Please login to add a commentAdd a comment