పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
బాపట్ల టౌన్: పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యతని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. మండలంలోని సూర్యలంక సమీపంలోని నగరవనంలో బుధవారం కలెక్ట్‌రేట్ సిబ్బంది ఆధ్వర్యంలో కార్తిక వనసమారాధన నిర్వహించారు. తొలుత కలెక్టర్ ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కలు నాటారు. ఆయనతో పాటు పలువురు జిల్లా అధికారులు కూడా నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రకృతిని ప్రేమించడంతో పాటు కాపాడాలని తెలిపారు. భావితరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దామనే నినాదంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి ఆగస్టు 30 నుంచి వనసమారాధన వరకు విస్తృతంగా మొక్కలు నాటాలని సీఎం చంద్రబాబు నాయుడు అన్ని జిల్లాల అధికారులను ఆదేశించారని జిల్లా కలెక్టర్ చెప్పారు. రాబోయే తరాలకు మంచి పర్యావరణం అందించడానికి ఇప్పుడు నాటే మొక్కలు ఎంతో మేలు చేస్తారని తెలిపారు. ఇప్పటి దాకా అటవీశాఖ ద్వారా 63 వేల మొక్కలు నాటినట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా సూర్యలంక బీచ్‌లో అందమైన వనం ఏర్పాటు లక్ష్యంతో అధికారులు ముందుకు సాగాలని ఆయన సూచించారు. అనంతరం జిల్లా కలెక్టర్ అధికారులంతా అటవీ ప్రాంతంలో వన భోజనం చేశారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జి.గంగాధర్ గౌడ్, జిల్లా అటవీ శాఖ అధికారి భీమయ్య పాల్గొన్నారు.
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తత అవసరం
తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి ఆదేశించారు. జిల్లా, మండల స్థాయి అధికారులతో బుధవారం ఆయన సమావేశం నిర్వహించారు. ఈనెల 22 నుంచి 27వ తేదీ వరకు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపారు. మత్స్యకారులు ఈనెల 27 వరకు వేటకు వెళ్లొదని, ఇప్పటికే వెళ్లిన వారిని బయటకు రప్పించాలని ఆదేశించారు. వరి చేలను 22 నుంచి 27వ తేదీ వరకు కోయరాదని, దీనిపై క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు.
● అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాల ఉద్యోగాల భర్తీ ప్రక్రియ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో అంగన్‌వాడీ పోస్టులకు ఇంటర్వ్యూ నిర్వహించారు. రెండు అంగన్‌వాడీ కార్యకర్తల ఉద్యోగానికి ముగ్గురు హాజరు కాగా, 44 ఆయాల ఉద్యోగాలకు 106 మంది హాజరయ్యారు. కార్యక్రమంలో మహిళ శిశు అభివృద్ధి శాఖ పీడీ ఉమా, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
● చిన్నారులను దత్తత తీసుకునే విషయంపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని జిల్లా కలెక్టర్ జె. వెంకటమురళి తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్‌లో దత్తత అవగాహన మాసోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కలెక్టర్ జె. వెంకటమురళి
Comments
Please login to add a commentAdd a comment