భార్యాభర్తలను ఢీకొన్న లారీ
నకరికల్లు: స్థానిక అద్దంకి–నార్కెట్‌పల్లి రాష్ట్ర రహదారిపై ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. రోడ్డు దాటుతున్న భార్యాభర్తలను ఢీకొన్న లారీ వేగం నియంత్రించుకోలేక ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును కూడా వెనుక నుంచి ఢీకొట్టింది. భార్యాభర్తలు ఇద్దరూ లారీ కింద పడడంతో భర్త మృతి చెందగా భార్యకు తీవ్రగాయాలయ్యాయి. ఆర్టీసీ బస్సులోని ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. ఈ ఘటన నకరికల్లులోని రాష్ట్ర రహదారిపై బుధవారం సంభవించింది. వివరాల్లోకి వెళితే.. నరసరావుపేట బస్టాప్ నుంచి పిడుగురాళ్ల బస్టాప్ వైపు వెళ్లేందుకు రోడ్డుదాటుతున్న భార్యాభర్తలను చైన్నె నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ వేగంగా ఢీకొంది. దీంతో వారిద్దరూ లారీ కింద పడిపోయారు. వేగం నియంత్రణ కాకపోవడంతో ఎదురుగా ఉన్న ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టింది. బస్సు వెనుక భాగం దెబ్బతింది. ప్రయాణికుల ఆర్తనాదాలతో ప్రజలు పెద్దసంఖ్యలో ఘటనాస్థలానికి చేరుకున్నారు. లారీ కింద పడి ఉన్న భార్యాభర్తలను కొద్దిసేపటి వరకు గుర్తించలేకపోయారు. స్థానికులు అతికష్టం మీద లారీ కింద పడి ఉన్న క్షతగాత్రులను బయటకు తీశారు. క్షతగాత్రులిద్దరూ మండలంలోని చీమలమర్రి గ్రామానికి చెందిన తోక వెంకాయమ్మ, కొండయ్య(56)లుగా గుర్తించారు. ప్రమాదంలో వెంకాయమ్మ, కొండయ్యలకు తీవ్రగాయాలు కాగా కొండయ్య కొన ఊపిరితో ఉన్నాడు. 108 వాహనంలో క్షతగాత్రులను నరసరావుపేటలోని వైద్యశాలకు తరలించే క్రమంలో కొండయ్య మృతిచెందాడు. మృతుడికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.
ఆర్టీసీ బస్సు ప్రయాణికులు క్షేమం
అనుకోని ఘటనకు బస్సులోని ప్రయాణికులు ఉలిక్కిపడి ఆర్తనాదాలు చేశారు. స్పందించిన స్థానికులు ప్రయాణికులను క్షేమంగా బయటకు దించారు.
రాష్ట్ర రహదారిపై భారీగా నిలిచిన ట్రాఫిక్
రోడ్డుప్రమాదానికి కారణమైన లారీ, ఆర్టీసీ బస్సు నడిరోడ్డుపై ఆగిపోవడంతో ట్రాఫిక్ భారీగా నిలిచింది. సుమారు గంటకు పైగా ట్రాఫిక్ నిలవడంతో వాహనాలు బారులుతీరాయి. ఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ చల్లా సురేష్, సిబ్బంది క్షతగాత్రులను 108లో నరసరావుపేట వైద్యశాలకు తరలించి ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు.
భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
Comments
Please login to add a commentAdd a comment