నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు | - | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు

Published Fri, Dec 27 2024 2:25 AM | Last Updated on Fri, Dec 27 2024 2:25 AM

-

సాక్షి ప్రతినిధి,బాపట్ల: అధికారం అప్పగిస్తే విద్యుత్‌ చార్జీలు పెంచబోమని, అవసరమనుకుంటే ఇంకా తగ్గిస్తామని నమ్మబలికిన చంద్రబాబు అధికారంలోకి రాగానే మాట తప్పారు. అపరాధ రుసుం పేరుతో ఇబ్బడిముబ్బడిగా చార్జీలు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలపై పెనుభారం మోపారు. గత నెలతో పోలిస్తే ఒక్కొక్క పేద కుటుంబంపై రూ.300 నుంచి వెయ్యి రూపాయల వరకు అదనంగా చార్జీల భారం పడింది. వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఎస్సీ కుటుంబాలకు 200 యూనిట్ల వరకూ ఉచితంగా విద్యుత్‌ ఇవ్వగా కూటమి సర్కారు నిరుపేద ఎస్సీలపైనా విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపింది. ప్రభుత్వం తీరుపై వారు మండిపడుతున్నారు. ఎన్నికల ముందు ఒకమాట చెప్పి అధికారంలోకి రాగానే మాటమార్చి ప్రజలను వంచించడంపై సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. ప్రజలపై ప్రభుత్వం విద్యుత్‌ చార్జీల భారాన్ని మోపడంపై ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. చార్జీ పెంపును నిరసిస్తూ ప్రజల తరపున పోరాటానికి సిద్ధమైంది. శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆందోళనలకు పిలుపునిచ్చింది. పార్టీ నియోజకవర్గ సమన్వయకర్తల ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాలు జరగనున్నాయి. ఇప్పటికే పార్టీ శ్రేణులతోపాటు ప్రజలు నిరసన కార్యక్రమాలలో పాల్గొనేందుకు సన్నద్ధమయ్యారు. ప్రభుత్వాన్ని నిలదీసేందుకు సిద్ధమయ్యారు.

● బాపట్లలో మాజీ డిప్యూటీ స్పీకర్‌ కోన రఘుపతి ఆధ్వర్యంలో శుక్రవారం విద్యుత్‌ చార్జీ పెంపునకు నిరసనగా ఆందోళన జరగనుంది. ఉదయం 9 గంటల ప్రాంతంలో స్థానిక రథం బజార్‌లోని కోన భవన్‌ నుంచి చీరాల రోడ్డులోని విద్యుత్‌శాఖ ఎస్సీ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ ఉంటుంది. తర్వాత చార్జీల పెంపును నిరసిస్తూ అధికారులకు వినతిపత్రం అందజేస్తారు.

● చీరాలలో పార్టీ సమన్వయకర్త కరణం వెంకటేశ్‌ ఆధ్వర్యంలో ఉదయం 10 గంటలకు పార్టీ శ్రేణులు, ప్రజలు ర్యాలీగా వెళ్లి కొత్తపేట పంచాయతీలో వీఆర్‌ఎస్‌ కాలేజీ రోడ్డులోని విద్యుత్‌ డీఈ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తారు. అనంతరం విద్యుత్‌ అధికారులకు వినతిపత్రం సమర్పిస్తారు.

● పర్చూరులో సమన్వయకర్త యడం బాలాజీ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, విద్యుత్‌ చార్జీల బాధితులు పర్చూరులోని విద్యుత్‌ డీఈ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పిస్తారు.

● అద్దంకిలో సమన్వయకర్త పానెం చిన హనిమిరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలతో కలిసి పట్టణంలో శింగరకొండ రోడ్డులోని విద్యుత్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహిస్తారు. తర్వాత అధికారులకు వినతిపత్రం సమర్పిస్తారు.

● వేమూరులో సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు, ప్రజలు స్థానిక రైల్వేగేటు నుంచి విద్యుత్‌ ఏఈ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం కార్యాలయంవద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. తర్వాత అధికారులకు వినతిపత్రం సమర్పిస్తారు.

● రేపల్లెలో సమన్వయకర్త ఈపూరు గణేష్‌ ఆధ్వర్యంలో పార్టీశ్రేణులు, ప్రజలతో కలిసి బస్టాండు సెంటర్‌ నుంచి ఇసుకపల్లిలోని విద్యుత్‌ డివిజనల్‌ ఇంజినీర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి ధర్నా అనంతరం విద్యుత్‌ చార్జీల పెంపును తగ్గించాలని అధికారులకు వినతిపత్రం సమర్పిస్తారు.

అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ర్యాలీలు, ధర్నాలు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement