విజయవాడస్పోర్ట్స్: ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో 40 చోరీలకు పాల్పడి తెలుగు రాష్ట్రాల పోలీసులకు మస్కా కొట్టి తప్పించుకుని తిరుగుతున్న ఘరానా దొంగ ఎట్టకేలకు ఎన్టీఆర్ జిల్లా పోలీసులకు చిక్కాడు. పటమట పోలీస్ స్టేషన్‌లో నమోదైన చోరీ కేసును దర్యాప్తు చేస్తున్న సీసీఎస్ పోలీసులు రామవరప్పాడు రింగ్ వద్ద కంచర్ల మోహనరావును అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. వివరాలను పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు కమాండ్ కంట్రోల్ రూంలో విలేకరులకు గురువారం వెల్లడించారు. విజయవాడ ప్రసాదంపాడులోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఈ ఏడాది అక్టోబర్ 10న చోరీ జరిగింది. పటమట పీఎస్‌లో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. విచారణలో వారు విఫలమడంతో ఈ కేసును సీసీఎస్‌కు అప్పగించారు. సీసీఎస్ పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కేసును దర్యాప్తు చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు క్రైం డీసీపీ కె.తిరుమలేశ్వరరెడ్డి, ఏడీసీపీ ఎం.రాజారావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ వి.వి.లక్ష్మీనారాయణ, పలువురు సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రామవరప్పాడురింగ్ వద్ద ఓ వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని అక్కడి స్థానికులు ఇచ్చిన సమాచారంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండలం కసుకూరు గ్రామానికి చెందిన కంచర్ల మోహనరావుగా గుర్తించారు. అతను ప్రస్తుతం కాకినాడ జిల్లా తుని మండలం, మరువాడ గ్రామంలో నివసిస్తున్నట్లు విచారణలో తేలింది.
40 చోరీ కేసులు
విశాఖపట్నం, కాకినాడ, తూర్పు, పశ్చిమగోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, రాజమండ్రి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం, హైదరాబాద్‌లలో పలు చోరీలకు పాల్పడ్డాడని, ఇతనిపై ఆయా జిల్లాల్లోని పోలీస్ స్టేషన్‌లలో 40కిపైగా కేసులున్నాయని వెల్లడించారు. పట మట పీఎస్ పరిధిలో రెండు చోరీ లు, ఒంగోలు, చిలకలూరిపేట, అమలాపురం, డోర్నాల, అద్దంకి పీఎస్‌ల పరిధి లో చోరీలు చేసినట్లు విచారణలో నిందితుడు అంగీకరించాడు.
Comments
Please login to add a commentAdd a comment