ప్రతిభలో మేటి.. ఉత్సాహంగా పోటీ
నరసరావుపేట: విద్యార్థులలో సృజనాత్మకతను వెలికి తీసేందుకు పల్నాడు బాలోత్సవం లాంటి కార్యక్రమాలు దోహదపడతాయని ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పేర్కొన్నారు. శనివారం పల్నాడు రోడ్డులోని పీఎన్‌సీ అండ్ కేఆర్ కళాశాల ప్రాంగణంలో పల్నాడు బాలోత్సవం రెండవ పిల్లల పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. భారీ సంఖ్యలో పాల్గొన్న విద్యార్థులకు లఘు నాటికలు, గ్రూపు శాసీ్త్రయ నృత్యం, పాటలు, వ్యాసరచన, పోస్టర్ ప్రజెంటేషన్, కోలాటం, హ్యాండ్ రైటింగ్, సైన్స్ ప్రయోగాలు, కథా రచన, కథా విశ్లేషణ, మ్యాప్, ఏకపాత్రాభినయం, మైమ్, మ్యూజిక్, మిమిక్రీ, డిబేట్, క్విజ్, అంతర్జాలంలో అన్వేషణ పోటీలు నిర్వహించారు. దీనికి ముఖ్యఅతిథులుగా ఎంపీ లావు, ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. బాలోత్సవం కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించిన సభలో ఎంపీ లావు మాట్లాడుతూ ఈ కార్యక్రమాల ద్వారా విద్యార్థులలో స్నేహభావం, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని చెప్పారు. పిల్లలు అన్ని విషయాలు పంచుకునేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వ్యవహరించాలని సూచించారు. ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ... ఆధునిక యుగంలో చిన్నారులు కంప్యూటర్, టీవీ, సెల్ ఫోన్లకు ఆకర్షితులై ఆటపాటలు, ఇతర కార్యక్రమాలు మర్చిపోతున్నారని తెలిపారు. ర్యాంకులే ముఖ్యం అన్నట్లు కాకుండా సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా పిల్లల భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం ప్రధాన కార్యదర్శి పిన్నమనేని మురళీకృష్ణ , బాలోత్సవాల కార్యదర్శి కట్టా కోటేశ్వరరావు, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు, టీడీపీ నాయకులు కపలవాయి విజయకుమార్, నల్లపాటి రాము, బాలోత్సవాల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెస్ ఆర్కే ప్రసాద్, అధ్యక్షుడు సీహెచ్ రాజారెడ్డి, కోశాధికారి కోయా రామారావు, కమిటీ సభ్యులు ఎ. భాగేశ్వరిదేవి, అనుముల లక్ష్మీశ్వరరెడ్డి పాల్గొన్నారు.
అట్టహాసంగా పల్నాడు
బాలోత్సవాలు ప్రారంభం
ముఖ్య అతిథులుగా ఎంపీ లావు,
ఎమ్మెల్సీ లక్ష్మణరావు,
ఎమ్మెల్యే చదలవాడ హాజరు
పలు అంశాలలో తలపడిన విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment