సాక్షి ప్రతినిధి,బాపట్ల: జిల్లాలో ఇసుక అక్రమ రవాణా వ్యవహారం శృతిమించి రాగాన పడింది. బాపట్ల ఎంపీ, చీరాల ఎమ్మెల్యే వర్గాల మధ్య గొడవలకు దారితీసింది. ఏకంగా ఇసుక క్వారీలో ఉన్న ఎంపీ అనుచురుడు రామకృష్ణకు చెందిన జేసీబీని ఎమ్మెల్యే వర్గీయులు తగులబెట్టే వరకు వచ్చింది. దీనికి సంబంధించి పోలీసులు ఎమ్మెల్యే వర్గీయులు జితేందర్‌రెడ్డి, సతీష్ మరికొందరిపై కేసు నమోదు చేయగా ఇప్పటికి సతీష్ ఒక్కడినే అరెస్ట్ చేసి అరెస్ట్‌లకు తాత్కాలిక విరామమిచ్చారు. ఈ గొడవతో పచ్చనేతల ఇసుక రచ్చ రోడ్డున పడింది. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ వెంకట మురళి చీరాల ఆర్‌ఐ నాగకుమార్, వీఆర్వోలు శివారెడ్డి, తులసీలను సస్పెండ్ చేసి చీరాల తహసీల్దారు గోపీకృష్ణతోపాటు మరికొందరికి కూడా షోకాజ్ నోటీసు ఇవ్వడం మరింత చర్చకు దారితీసింది. ఎంపీ అనుచరుల ఇసుక క్వారీలు ఉన్న ప్రాంతాల్లోని కొందరు వీర్వోలపై మాత్రమే వేటువేసిన కలెక్టర్ చీరాల నియోజకవర్గంలో మొత్తం ఇసుక దందా నడిపిస్తున్న ఎమ్మెల్యే వర్గీయుల ఇసుక క్వారీలు ఉన్న ప్రాంతానికి చెందిన రెవెన్యూ అధికారులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు ఇసుక దొంగతనం చేస్తున్న వారిని వదిలేసి క్రింది స్థాయి అధికారులపై వేటు వేయడంపైనా జోరుగా చర్చసాగుతోంది.
వాస్తవానికి వేటపాలెం పరిధిలో ఉన్న ఇసుక దిబ్బలు, అసైన్డ్, ప్రభుత్వ, అటవీ భూముల నుంచి ఎమ్మెల్యే అనుచరులు బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలతోపాటు తెలంగాణ రాష్ట్రానికి సైతం ఇసుకను అక్రమంగా తరలించి అమ్ముకుంటున్నారు. వేటపాలెం మడంలంలోని పుల్లరిపాలెం సమీపంలోని భూములనుంచి పెద్ద ఎత్తున ఇసుక అక్రమరవాణా జరుగుతోందని ఇసుక అక్రమరవాణా ఆపకపోతే వేసవిలో తమకు తాగునీరు కూడా దొరకదని ఈ ప్రాంతానికి చెందిన సాయి ఎస్టీ కాలనీ వాసులు ఏకంగా జిల్లా కలెక్టర్‌తోపాటు అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నారు. వారు స్పందించకపోవడంతో ఎస్టీలు ఏకంగా జాతీయ ఎస్టీ కమిషన్‌కు రెండు సార్లు ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఎస్టీల ఫిర్యాదును విచారించి చర్యలు తీసుకోవాలని ఎస్టీ కమిషన్ ఆదేశించినా జిల్లా అధికారులు ఎమ్మెల్యే వర్గీయుల జోలికి వెళ్లక ఎస్టీలనే బెదిరించి సంతకాలు పెట్టాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు ఎస్టీలు ఆరోపించారు. పుల్లరిపాలెం సమీపంలోని భూములనుంచి ఎమ్మెల్యే వర్గీయులు పెద్దఎత్తున ఇసుక తరలిస్తున్న విషయం అందరికీ తెలుసు. వారంతా ఎమ్మెల్యే సొంత ప్రాంతానికి చెందిన అనుచరులన్న విషయం చీరాల ప్రాంతంలోనివారికి తెలుసు. నియోజకవర్గంలోని ఒక మండలానికి చెందిన తహసీల్దారు ఎమ్మెల్యే వర్గీయుల ఇసుక దందాకు పూర్తి సహకారం అందిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సదరు తహసీల్దార్‌కు జిల్లా కలెక్టర్ కార్యాలయం నుంచి పూర్తి సహకారం ఉన్న విషయం రెవెన్యూ వర్గాల్లో గుసగుసలు ఉన్నాయి. తహసీల్దార్ గతంలో పనిచేసిన మండలం నుంచి తన సొంత మనుషులుగా ఉన్న తొమ్మిది మంది వీఆర్వోలను ప్రస్తుతం చీరాల నియోజకవర్గంలోని మండలానికి తెచ్చుకోవడంలోనూ కలెక్టర్ కార్యాలయం సహకారం ఉందన్న ప్రచారం ఉంది. తీరంలో వ్యవహారాలు నడిపే క్రమంలో ఉన్నతాధికారులు సదరు తహసీల్దార్‌కు సహకారం అందిస్తున్నట్లు గుసగుసలు ఉన్నాయి.
ఉన్నతాధికారులకు మినహాయింపా?
ఇంకో ప్రధాన విషయంపై చర్చ జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే అనుచరులు ఇసుక అక్రమ రవాణా చేస్తుంటే వీఆర్వో స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడమేమిటో ఎవరికీ అంతుపట్టడంలేదు. అక్రమ రవాణా విషయం తహసీల్దారులు, ఆర్డీవో తదితర స్థాయి అధికారులకు తెలియదనుకోవాలా? లేక పెద్ద స్థాయి అధికారులపై చర్యలు తీసుకోవడం సరికాదనా? అధికారులపై సరే ఇసుక అమ్ముకుంటున్న ప్రజాప్రతినిధుల అనుచరుల సంగతేంటి? వారు కేసులకు అనర్హులా? ఏమో? ఉన్నతాధికారులే చెప్పాలి.
ప్రశ్నార్థకంగా కలెక్టర్ తీరు
ఎమ్మెల్యేలు ఇసుక అమ్మితే వీఆర్వోలపై వేటా?
జిల్లా ఉన్నతాధికారి తీరుపై
సర్వత్రా విమర్శలు
చీరాలలో పోటాపోటీగా ఎంపీ,
ఎమ్మెల్యే అనుచరుల ఇసుక అమ్మకాలు
ఎంపీ అనుచురుడి జేసీబీ
తగులబెట్టిన ఎమ్మెల్యే వర్గీయుడు
ఎంపీ అనుచరుల క్వారీల పరిధిలోని
వీఆర్వోలను సస్పెండ్ చేసిన
జిల్లా కలెక్టర్
ఎమ్మెల్యే అనుచరుల క్వారీల
జోలికి వెళ్లని వైనం
వాటి పరిధిలోని రెవెన్యూ
అధికారులపై నో యాక్షన్
ఇంత జరుగుతున్నా, ఇసుక అక్రమ రవాణాపై జాతీయస్థాయికి ఫిర్యాదులందినా ఆ ప్రాంతానికి చెందిన రెవెన్యూ అధికారులపై జిల్లా ఉన్నతాధికారి ఎందుకు చర్యతీసుకోవడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. నిజంగా ఈ విషయం జిల్లా కలెక్టర్‌కు తెలియదనుకోవాలా? లేక ఆ ప్రాంతంలో ఇసుక అక్రమ రవాణా జరగడం లేదని నిర్థారించుకున్నారా? అనే విషయంపై చర్చ సాగుతోంది.
వాస్తవానికి ఇసుక అక్రమరవాణాను అరికట్టే ఉద్దేశంతో స్థానిక రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకుంటే హర్షించాల్సిందే! ఏ అధికారినైనా అభినందించాల్సిందే! అలాంటప్పుడు కొందరు అధికారులపైనే కాకుండా బాధ్యులైన అందరు అధికారులపై చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ స్థాయిలో ఎవరు ఇసుక అక్రమంగా తరలిస్తున్నారో? తెలుసుకోవడం పెద్ద పనికాదు. కానీ చర్యలు నిష్పాక్షికంగా ఉంటే అందరూ హర్షిస్తారు. ప్రతి ఒక్కరూ మద్దతు పలుకుతారు.
Comments
Please login to add a commentAdd a comment