టీడీపీ కౌన్సిలర్ల ఓవరాక్షన్
చీరాల: మున్సిపల్ కౌన్సిల్ సమావేశం వాడీవేడిగా జరిగింది. అజెండాలోని అంశాలు చర్చ జరుగుతున్న సమయంలో తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు కొందరు చైర్మన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. మంగళవారం మున్సిపల్ కౌన్సిల్ హాలులో చైర్మన్ జంజనం శ్రీనివాసరావు అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం జరిగింది. సాధారణ సమావేశంలో భాగంగా 7వ అంశంపై చర్చ జరిగింది. వైఎస్సార్ సీపీ కౌన్సిలర్ మామిడాల రాములు మాట్లాడుతూ ప్రభుత్వం సిల్టు తీసేందుకు రూ.60 లక్షలు కేటాయించిందని, అయితే సక్రమంగా తీయడం లేదని ఆరోపించారు. ప్రధానంగా మ్యాన్ హోల్స్ లేకపోవడంతో 30 మీటర్లు, 40 మీటర్లు వరకు ఉన్న వాటి వద్ద హోల్స్ ఏర్పాటు చేసి ఆ ప్రాంతంలోనే సిల్టు తీయడం వలన కాలువలో పేరుకుపోయిన సిల్టు మొత్తం బయటకు రావడం లేదన్నారు. అలా కాకుండా తమ వార్డులలో అందరూ వ్యాపారస్తులు ఉన్న కారణంగా పండుగ తర్వాత కాలువలోని సిల్టు మొత్తం వచ్చేలా చేయాలని కోరారు. దీనిపై మున్సిపల్ డీఈ వివరణ ఇస్తుండగా మధ్యలో జోక్యం చేసుకున్న టీడీపీ కౌన్సిలర్ ఎస్.సత్యానందం మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం రూ.60 లక్షలు కేటాయించిందని, దీనితో సిల్టు పనులన్ని చాలా చక్కగా జరుగుతున్నాయన్నారు. మున్సిపల్ చైర్మన్ కొందరికి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన టీడీపీ కౌన్సిలర్..
దీంతో జోక్యం చేసుకుని చైర్మన్ కుర్చీకి గౌరవం ఉంటుందని, ఆ కుర్చీలో కూర్చొంటే పార్టీలతో సంబంధం ఉండదని, కౌన్సిలర్లందరిని ఒకే మాదిరిగా చూస్తారన్నారు. దీంతో సత్యానందం మాట్లాడుతూ ‘అదొక కుర్చీనా.. దానికి గౌరవం ఉందా ? అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో చైర్మన్ సభను, ప్రథమ పౌరుడి కుర్చీని అవహేళన చేయడం సరికాదంటూ సభను వాయిదా వేస్తున్నామంటూ, మిగిలిన అంశంపై చర్చకు వెళ్లకుండా ఏడవ అంశంతోనే వాయిదా పడింది. ముందుగా వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటుపై చర్చ జరిగింది. కూరగాయల మార్కెట్ వద్ద వంగవీటి మోహనరంగా విగ్రహం ఏర్పాటు చేసుకోవాలని అనుమతి ఇస్తూ ఒకటో అంశాన్ని ఆమోదించింది. దీనిపై కూడా సత్యానందం అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌన్సిలర్లు సత్యానందం, మల్లెల లలిత మాట్లాడుతూ చీరాల మొత్తం విగ్రహాలమయం అయిందని, ట్రాఫిక్‌కు అంతరాయంగా ఉందని, విగ్రహాలన్నింటిని కుందేరు సమీపంలో గాని, మరో ప్రాంతంలో గాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. చైర్మన్ మాట్లాడుతూ అజెండాలో పెట్టిన వంగవీటి విగ్రహ ఏర్పాటు అంశాన్ని ఆమోదించి మిగిలిన విగ్రహాలను ఎస్‌ఎస్ ట్యాంక్ వద్ద గల ఖాళీ స్థలంలో ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కౌన్సిల్ సమావేశం హాలులో ఎమ్మెల్యే ప్రభుత్వ పీఏ సుబ్బారావు, ప్రైవేటు పీఏ రవీంద్రలు కౌన్సిల్ హాలులో కూర్చొని టీడీపీ కౌన్సిలర్లకు దిశానిర్దేశం చేయడం విశేషం. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ అబ్దుల్ రషీద్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
మున్సిపల్ చైర్మన్ కుర్చీకి
గౌరవం లేదంటూ వ్యాఖ్యలు
అర్ధాంతరంగా సమావేశం వాయిదా
Comments
Please login to add a commentAdd a comment