అధ్వానంగా రహదారులు
సంక్రాంతి నాటికి రహదారులపై గుంతలు కనిపించకుండా పూడ్చి వేస్తామని కూటమి ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. మరో వారం రోజుల్లో సంక్రాంతి సంబరాలకు పల్లెలు సిద్ధమవుతున్నాయి. రహదారులపై గుంతలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. రేపల్లె నియోజకవర్గం పరిధిలోని పలు రహదారులపై గుంతలు పూడ్చేందుకు నిధులు మంజూరుకాగా స్థానిక నాయకులు, అధికారులపై ఒత్తిడి తెచ్చి పనులు చేయకుండానే బిల్లులు చేసుకుంటున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రేపల్లె నియోజకవర్గంలో 46 కిలోమీటర్ల మేర రహదారి మరమ్మతులు, 126 కిలోమీటర్ల రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం రూ.21.34 కోట్లు కేటాయించింది. నల్లూరుపాలెం నుంచి తుమ్మల వరకు, మంత్రిపాలెం నుంచి అడవులదీవి వరకు, నగరం నుంచి పిట్టలవానిపాలెం వరకు రూ.6 కోట్లతో మరమ్మతులు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఆయా రహదారులను పరిశీలిస్తే ప్రారంభంలో కొంత పనులు చేసినా మిగిలిన రహదారులపై తట్ట మట్టి పోసిన దాఖలాలు లేవు. నల్లూరుపాలెం నుంచి తుమ్మల వరకు ఆరు కిలోమీటర్ల మేర రహదారి ఉండగా తుమ్మల గ్రామం నుంచి ఒక కిలో మీటరు మేర అక్కడక్కడ రహదారులకు మరమ్మతులు నిర్వహించి మమ అనిపించారు. నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న మూడు రహదారుల నిర్మాణానికి రూ.9 కోట్ల నిధులు మంజూరైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. రేపల్లె–నిజాంపట్నం ప్రధాన రహదారికి రూ.5 కోట్లు, గంగడిపాలెం–లంకెవానిదిబ్బ, అడవులదీవి–కూచినపూడి రహదారి నిర్మాణాలకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు రహదారి నిర్మాణ పనులు ప్రారంభించలేదు. –రేపల్లె రూరల్
Comments
Please login to add a commentAdd a comment