పరిశ్రమల స్థాపనతో ఉత్పాదకత పెరుగుదల
జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి
బాపట్ల: పరిశ్రమల స్థాపనతో ఉత్పాదకత పెరుగుతుందని తద్వారా నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్‌లో అభివృద్ధి పనులపై సమీక్షించారు. విత్తనాలతో డీజిల్ ఉత్పత్తి చేసే పరిశ్రమ కొరిశపాడులో రూ.245.66 కోట్లతో నిర్మిస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. 500 మందికి ఉద్యో గ అవకాశాలు లభిస్తాయన్నారు. కర్లపాలెం మండలంలో రూ.120 కోట్లతో మరో పరిశ్రమ ఏర్పాటు కానున్నదని, 800 మందికి ఉద్యోగాలు వస్తాయ న్నారు. చీరాల ఇండస్ట్రియల్ క్లస్టర్‌లో రూ.10 కోట్లతో వైద్య రంగానికి అనుబంధమైన యూనిట్ స్థాపనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద ఇప్పటివరకు 36,100 దరఖాస్తులు రాగా, 2,649 మందికి యూనిట్లు మంజూరు చేశామన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల విద్యుత్ కనెక్షన్‌ల సర్వే ప్రక్రియ వేగంగా పూర్తి చేయాలన్నారు. పల్లె పండుగ పనులు త్వరగా పూర్తిచేసి, జనవరి నెలాఖరులో ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలోని అన్ని పంచాయతీలలో 3,133.63 కిలోమీటర్ల పొడవున అంతర్గత రహదారులు ఉన్నాయని చెప్పారు. అందులో సీసీ రోడ్లు 1,144.61 కిలోమీటర్ల మేర నిర్మించినట్లు వివరించారు. మరో 74.22 కిలోమీటర్ల మేర సీసీ రోడ్లు నిర్మించాల్సి ఉందన్నారు. మార్చి నెలాఖరునాటికి మరో 45.78 కిలోమీటర్ల దూరం సీసీ రోడ్ల నిర్మాణానికి అధికారికంగా మంజూరు చేస్తామన్నారు. 654 సీసీ రోడ్లు, బీటీ రోడ్లు నిర్మించాలని లక్ష్యం కాగా, 239 రోడ్లు మాత్రమే నిర్మించడంపైనా ప్రశ్నించారు. రహదారుల నిర్మాణానికి అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రతి గృహానికీ సురక్షిత నీరు
ప్రతి గృహానికీ సురక్షిత నీరు పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. జిల్లాలో 3,64,788 గృహాలు ఉండగా, 1,48,361 గృహాలకు ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయని, మిగిలిన 2,16,427 గృహాలకు కనెక్షన్లు లేకపోవడం బాధాకరమన్నారు. జలజీవన్ మిషన్ కింద ప్రతి ఇంటికీ ట్యాప్ కనెక్షన్లు ఇవ్వాలనే ఉద్దేశంతో రూ.587.55 కోట్ల నిధులు జిల్లాకు విడుదల అయ్యాయన్నారు. సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి జి గంగాధర్‌గౌడ్, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
ప్రతి నెలా వసతి గృహాలను సందర్శించాలి
బాపట్ల: ప్రభుత్వ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రతి నెలా తప్పనిసరిగా పరిశీలించి విద్యార్థులకు వైద్యాధికారులు వైద్య పరీక్షలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి ఆదేశించారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్ లోని పిజిఆర్‌ఎస్ సమావేశ మందిరంలో వైద్యాధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వెల్ఫేర్ హాస్టల్స్, రెసిడెన్షియల్ స్కూలు తప్పనిసరిగా ప్రతి మెడికల్ ఆఫీసర్ ప్రతి నెలా విజిట్ చేయాలని సూచించారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు ప్రతి రెండు రోజులకు ఒకసారి హాస్టల్‌ను విజిట్ చేయాలని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment