పోలీసులు తీరు మార్చుకోవాలి
న్యాయవాదుల విధుల బహిష్కరణ
చీరాల రూరల్: కక్షిదారులకు న్యాయ సహాయం అందించడంలో నిమగ్నమయ్యే న్యాయవాదులపై పోలీసులు తీరు దారుణంగా ఉందని.. న్యాయవాదులపై నిత్యం పోలీసులు దాడులకు తెగబడడం వారిపై తప్పుడు కేసులు బనాయించడం మానుకోవాలని చీరాల న్యాయవాదులు ముక్తకంఠంతో ఖండించారు. పొన్నూరు కోర్టులో విధులు నిర్వర్తిస్తున్న న్యాయవాది బేతాళ ప్రకాశరావుపై పోలీసులు దాడిచేసి గాయపరచడమే కాకుండా ఆయనపైనే కేసు నమోదు చేసిన విషయమై మంగళవారం చీరాల బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. బార్ అసోసియేషన్ అద్యక్ష, కార్యదర్శులు గౌరవ రమేష్‌బాబు, కొటిక ఉదయ భాస్కరరావు, పలువురు సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తరువాత న్యాయవాదులపై పోలీసుల దాడులు చేయడం ఎక్కువయ్యాయన్నారు. గత పదిరోజుల్లో పోలీసులు మూడు చోట్ల దాడులు చేశారన్నారు. అనంతపురంలో పోలీసు స్టేషన్‌లో న్యాయవాది మరణించడం, మరో జిల్లాలో సుదర్శనరెడ్డి అనే న్యాయవాదిని చొక్కా పట్టుకుని నడిరోడ్డుపై సీఐ లాక్కెళ్లడంలాంటివి చూస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడుందని ప్రశ్నలు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయవాదుల రక్షణార్థం తక్షణమే ప్రభుత్వాలు స్పందించి న్యాయవాదుల రక్షణ చట్టాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బండారుపల్లి హేమంత్ కుమార్, ఆకిశెట్టి పుల్లయ్య నాయుడు, పుల్లెల హరిబాబు, కర్నేటి రవి, రాజు వెంకటేశ్వరరెడ్డి, బత్తుల అమృత్, మంకెన అశోక్ కుమార్, నీలి కస్తూరి నాధ్, మోపూరి తారకరామారావు, సిరిపురం కామేశ్వరరావు, గోదావరి సురేష్, బిళ్లా ఆరోగ్యరావు, షేక్ మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment