ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం
బాపట్ల: జిల్లాలో అర్హులైన నిరుపేదలందరూ పీఎంఏవై 2.0 పథకం కింద ఇళ్లు నిర్మించుకోడానికి కేంద్ర ప్రభుత్వం రూ.2.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోందని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. విజన్ బాపట్ల–2047 అమలు ప్రణాళికపై 14 శాఖల అధికారులతో బుధవారం స్థానిక కలెక్టరేట్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లా యూడీఐ పరిధిలో ఉన్నందున అర్హులైన నిరుపేదలందరికీ పీఎంఏవై 2.0 పథకం వర్తిస్తుందని కలెక్టర్ చెప్పారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా సచివాలయాల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో లక్ష గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా జిల్లాలో గృహాల ప్రస్తుత పరిస్థితిపై కలెక్టర్ ఆరా తీశారు. గృహాలు పూర్తికాని చోట లక్ష్యాలు పూర్తి చేసేలా మండల ప్రత్యేకాధికారులు, మండల స్థాయి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇసుక రీచ్‌లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అక్రమ రవాణాను అరికట్టాలని చెప్పారు. ఐవీఆర్‌ఎస్ ద్వారా ఇసుక కొనుగోలుదారులు అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారని తెలిపారు. అటవీ శాఖ ద్వారా 4.13 లక్షల మొక్కలను నాటించి, జిల్లాను పచ్చదనంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. బీచ్‌ల వద్ద 200 హెక్టార్లలో మడ మొక్కలను నాటి సుందరీకరించాలని అన్నారు. సీపీఓ అధికారి శ్రీనివాస్, 14 శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రూ.9.28 కోట్ల నిధులు తక్షణం కావాలి
జల వనరుల సంరక్షణ, పంట కాల్వలు, చెరువుల గట్ల బలోపేతానికి రూ.9.28 కోట్ల నిధులు అత్యవసరమని జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి తెలిపారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సాధికారత సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్‌పీ సిసోడియ అమరావతి నుంచి బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సెప్టెంబర్‌లో జిల్లాలో జరిగిన వరద విపత్తు నిర్వహణపై జిల్లా కలెక్టర్‌తో ఆయన మాట్లాడారు. కృష్ణా నది వరద విపత్తును సమర్థంగా ఎదుర్కొన్నామని, జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో పనిచేసిందని కలెక్టర్ వెంకట మురళి సిసోడియాకు వివరించారు. ఆగస్టులో రూ.2 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.5 కోట్ల నిధులు జిల్లాకు విడుదల అయ్యాయన్నారు. ఆశ్రయం, సహాయక చర్యలకు రూ.6.31 కోట్లు ఖర్చు అయ్యిందని.. మిగిలిన రూ.69 లక్షలు ప్రభుత్వానికి పంపుతామని కలెక్టర్ చెప్పారు. దెబ్బ తిన్న గృహాలకు, పంట నష్ట పరిహారం రూ.45 కోట్లు ప్రభుత్వమే నేరుగా పంపిణీ చేసిందన్నారు. డీఆర్వో జి.గంగాధర్ గౌడ్, అగ్నిమాపక, విపత్తుల నిర్వహణాధికారి మాధవనాయుడు, జె.జెనమ్మ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జిల్లాను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలి
చారిత్రాత్మక సంపదను భద్రపరిచి, పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని కలెక్టర్ జె.వెంకట మురళి అన్నారు. పర్యాటక శాఖ రాష్ట్ర ఉన్నతాధికారులతో బుధవారం స్థానిక కలెక్టర్ చాంబర్‌లో ఆయన సమావేశమయ్యారు. కాకతీయులు, చోళులు నాటి దేవాలయాలు వారసత్వ సంపదగా జిల్లాలో ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. బాపట్ల సూర్యలంక బీచ్‌ని అభివృద్ధి చేస్తే పర్యాటకుల సంఖ్య మరింత పెరుగుతుందన్నారు. హెచ్‌పీవీ పైప్ ఏర్పాటుతో సురక్షితంగా సముద్రంలో మునగడానికి వీలుంటుందని చెప్పారు. ప్రతిపాదనలు ప్రభుత్వాలకు పంపాలన్నారు. 1,650 కొబ్బరి మొక్కలు నాటడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. పర్యాటక శాఖ ద్వారా నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తే జిల్లా పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతుందని కలెక్టర్ వివరించారు. ఇందుకు కేంద్రానికి నివేదిక పంపాలని సూచించారు. పర్యాటక శాఖ ఆపరేషన్ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మావతి, శివషరమ్ పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ జె.వెంకటమురళి
Comments
Please login to add a commentAdd a comment