ముక్కోటికి మంగళాద్రి ముస్తాబు
మంగళగిరి (తాడేపల్లిరూరల్): మంగళగిరిలోని శ్రీదేవి, భూదేవి సమేత లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ముక్కోటి ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఏకాదశి రోజు తెల్లవారుజాము 4 గంటల నుంచే స్వామి దేవేరుల సమేతంగా బంగారు గరుడ వాహనంపై ఉత్తరద్వార ద్వారా భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. దీనికోసం ఆలయ అధికారులు ఇప్పటికే సన్నాహాలు పూర్తిచేశారు. ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఏకాదశి ఒక్కరోజునే సుమారు లక్ష మంది భక్తులు స్వామిని దర్శించుకునే అవకాశం ఉందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
దక్షిణావృత శంఖం
వైకుంఠ ఏకాదశి రోజున దక్షిణావృత శంఖంతో భక్తులకు తీర్థం అందించడం ఆనవాయితీగా వస్తోంది. 1820లో తంజావూరు మహారాజు వారణాసి యాత్రలో భాగంగా మార్గమధ్యలో లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని బంగారు తొడుగు గల దక్షిణావృత శంఖాన్ని సమర్పించారు. అప్పటి నుంచి ఏటా ముక్కోటి ఏకాదశి రోజున ఈ శంఖంతో లక్ష్మీనరసింహస్వామికి అభిషేకం చేస్తారు. ఆ శంఖం ద్వారానే భక్తులకు తీర్థం అందిస్తారు. ఈ శంఖం నుంచి నిత్యం ఓంకారం నాదం వినిపిస్తుంటుందని చెబుతారు.
ఏర్పాట్లు పరిశీలించిన ఎస్పీ
ముక్కోటి సందర్భంగా ఉత్సవ, భద్రతా ఏర్పాట్లను ఎస్పీ సతీష్‌కుమార్ బుధవారం ఆలయ ఈఓ రామకోటిరెడ్డితో కలిసి పరిశీలించారు. సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. పట్టణ, రూరల్ సీఐలు వినోద్‌కుమార్, శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
నేడు, రేపు ఉత్సవాలు
మంగళాద్రి క్షేత్రంలో జనవరి 9,10 తేదీల్లో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల నిర్వహణకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 9వ తేదీ జాగరణ సందర్భంగా భజనలు, అన్నమయ్య సంకీర్తనలు, పలు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గురువారం స్వామిని జగన్మోహిని రూపంలో అలంకరించి పుష్కక విమానంపై ఊరేగిస్తారు. అర్ధరాత్రి దాటిన తరువాత తిరుమంజన ఉత్సవం నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా 10న శుక్రవారం వేకువ జామున 4 గంటల నుంచి స్వామి ఉత్తర ద్వార దర్శనభాగ్యం కల్పిస్తారు. మధ్యాహ్నం స్వామి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. దక్షిణావృత శంఖు తీర్థాన్ని 9, 10 తేదీల్లో ఇస్తారు.
రేపు స్వామి ఉత్తర ద్వార దర్శనం
బంగారు శంఖుతో తీర్థం వేలాదిగా తరలిరానున్న భక్తులు ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు
Comments
Please login to add a commentAdd a comment