అవధానానికి కేరాఫ్‌ నారాయణం | - | Sakshi
Sakshi News home page

అవధానానికి కేరాఫ్‌ నారాయణం

Published Fri, Jan 17 2025 1:48 AM | Last Updated on Fri, Jan 17 2025 1:48 AM

అవధానానికి కేరాఫ్‌ నారాయణం

అవధానానికి కేరాఫ్‌ నారాయణం

అద్దంకి: తెలుగు సాహిత్యంలో అష్టవధానానికి ఒక ప్రత్యేకత ఉంది. దేశ భాషల్లో ఏ భాషకు లేని విశిష్ట ప్రక్రియ అవధానం మన తెలుగు భాషకు ఉంది. అద్భుత ధారణా (జ్ఞాపకం) శక్తితోపాటు, తెలుగు భాష మీద, తెలుగు చంధస్సు మీద, జాతీయ, అంతర్జాతీయ రాజకీయ, ఒకటేమిటి అన్ని విషయాల మీద అవధానికి పట్టు ఉంటేనే అవధానం పండుతుంది. వాటన్నింటి మీద పట్టు సాధించిన వ్యక్తి చేసే అవధాన ప్రక్రియ చాలా గొప్పది. ఈ ప్రక్రియ తెలుగు భాషకే సొంతం. అలా అవధానం చేయగిగిన వారిలో అద్దంకి పట్టణానికి చెందిన నారాయణం బాలసుబ్రహ్మణ్యం ఒకరు. ఈయన ఇంకొల్లు మండలం కొణికి గ్రామానికి చెందిన నారాయణం రాఘవాచార్యులు, పద్మావతమ్మ కుమారుడు. ప్రస్తుతం బాలసుబ్రహ్మణ్యం అద్దంకిలో నివాసం ఉంటున్నాడు. చిన్నప్పటి నుంచి తెలుగు భాష మీద అభిమానం పెంచుకున్న బాలసుబ్రహ్మణ్యం పదో తరగతి వరకు చదివిన తరువాత తిమ్మసముద్రం గ్రామంలో భాషా ప్రవీణ చదివారు. తరువాత ప్రైవేట్‌గా ఎంఏ చేశారు. 1984లో ప్రకాశం జిల్లా కొండపి మండలం తంగేళ్లలో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టారు. 2002లో గ్రేడ్‌–1 తెలుగు ఉపాధ్యాయుడిగా ఉద్యోగోన్నతి పొందాడు. 2020లో మండలంలోని తిమ్మాయపాలెం గ్రామ జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో రిటైర్‌ అయ్యారు.

15వ ఏటనే పద్యాల మీద ఆసక్తి..

తన 15వ ఏటనే పద్యాలు రాయడం మీద ఆసక్తి పెంచుకున్న సబ్రహ్మణ్యం అప్పట్లో రేడియోలో వచ్చే సరస వినోదిని సమస్య పూరణం చేసి రాసి పంపేవాడు.

మోపిదేవి స్ఫూర్తితో అవధానంలోకి..

తాను ప్రాశ్చ కళాశాలలో చదువుతున్న రోజుల్లో అంటే 1979లో జిల్లెళ్లమూడి నుంచి వచ్చిన మోపిదేవి భాస్కర్‌ అష్టావధానం చేయడం చూసి స్ఫూర్తి పొందాడు. పద్యాలు రాస్తున్న తను ఎందుకు అష్టావధానం చేయకూడదనే సంకల్పంతో అటు వైపు దృష్టి మరల్చాడు. తొలి ప్రయత్నంలోనే తన కళాశాలలోనే అష్టావధానం చేసి అధ్యాపకుల మన్ననలు అందుకున్నారు. అదే పట్టుతో ఇప్పటికి 374 అష్టావధానాలు చేశాడు. ప్రముఖ శతావధానులు అపర్ణ, శాంతి స్వరూప్‌ స్ఫూర్తితో శతావధానం చేయాలని నిర్ణయించుకున్నారు. దాని మీద పట్టు సాధించి ఇప్పటికి నాలుగు శతావధానాలు చేశారు. ఖర్చుతో కూడుకుని ఉండటం, లక్ష వరకు ధన వ్యయం చేయాల్సి రావడంతో పెద్దగా శతావధానాలు చేయలేకపోయాడు.

ఆరు శతకాల రచన..

ఆంజనేయ, వల్లభరాయ, లలాతాంబిక, చంద్రశేఖర, అయినమల్లి గణపతి, స్వర్ణ శతకాలతోపాటు, తాను చేసిన రెండు శతావధానాలు రెండు పుస్తకాలు అచ్చయ్యాయి. బాలసుబ్రహ్మణ్యం అవధానం విన్న పెద్దలు ఆయనకు అవధానమణి, అవధాన విశారద, అవధాన కళాప్రపూర్ణ, అవధాన సుధాకర, అవధాన కంఠీరవ, కళాతపస్వి అనే బిరుదులు ఇచ్చారు. మరో వైపు విద్యాశాఖ విద్యార్థులకు చేస్తున్న అత్యుత్తమ బోధనకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడి అవార్డు అందజేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా 343 అష్టావధానాలు, నాలుగు శతావధానాలు రిటైర్‌ అయిన తరువాత కొనసాగింపు అవధానంలో ఎన్నో బిరుదులు, సత్కారాలు ప్రభుత్వ ప్రోత్సాహం అవసరమంటున్న అవధాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement