అండర్–14 జట్టుకు బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్ ఎంపి
బాపట్ల: అండర్–14 క్రికెట్ ఆంధ్ర జట్టులో బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్ ఉనైస్‌కు అవకాశం దక్కింది. గత నెలలో జరిగిన అండర్–14 జిల్లాస్థాయి ఎంపికల్లో తొలిసారిగా పాల్గొని గుంటూరు జిల్లా జట్టుకు ఎంపికయ్యాడు. కృష్ణా, చిత్తూరు, నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం, అనంతపూర్, విశాఖపట్నం జిల్లాలతో జరిగిన పోటీల్లో తన ప్రతిభ కనబర్చాడు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన 60 మంది క్రీడాకారుల్లో సాద్ స్థానం దక్కించుకున్నాడు. చివరిగా విజయనగరంలో జరిగిన జోనల్ పోటీల్లో 17 మందితో కూడిన ఆంధ్ర అండర్–14 క్రికెట్ జట్టుకు ఎంపిక చేశారు. అందులో అబ్దుల్ సాద్ కూడా ఒకరు కావడం విశేషం. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 18వ తేదీ వరకు పాండిచ్చేరిలో జరిగే రాష్ట్రస్థాయి అండర్–14 పోటీల్లో అబ్దుల్ సాద్ పాల్గొనబోతున్నారు. అద్భుతమైన ప్రతిభ కనబరిచిన అబ్దుల్ సాద్‌ను ఉత్తమ క్రీడాకారుడుగా తీర్చిదిద్దటంలో కృషిచేసిన కోచ్ అమీర్‌ను పలువురు అభినందించారు. కార్యక్రమంలో బాపట్ల క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రామ్మోహన్, స్టాన్లీ విమల్‌కుమార్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అబ్దుల్ సాద్‌కు పలువురు క్రీడాకారులు, పుర ప్రముఖులు అభినందనలు తెలిపారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన అండర్–14 స్టేట్ టీంలో బాపట్ల విద్యార్థి అబ్దుల్ సాద్‌కు అవకాశం దక్కటం అభినందనీయమని బాపట్ల క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు రఘునాథ్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment