వాస్తవాలను ప్రతిబింబిచేవే నాటికలు
యద్దనపూడి: సమాజంలో జరుగుతున్న వాస్తవాలను ప్రజలకు కళ్లకు కట్టినట్టు చూపించేవే నాటికలని రచయిత, దర్శకుడు డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు అన్నారు. గురువారం మండలంలోని అనంతవరం గ్రామంలో రెండో రోజు ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో తృతీయ ఉభయ తెలుగు రాష్ట్రాల నాటిక పోటీల్లో ముఖ్య అతిథులుగా వేదిక చైర్మన్ ముత్తవరపు సురేష్‌బాబు, గుంటూరు కళాపరిషత్ అధ్యక్షులు పీవి మల్లికార్జునరావు, సీని, టీవి నటుడు, దర్శకుడు నాయుడు గోపి పాల్గొన్నారు. కందిమళ్ల మాట్లాడుతూ సమాజంపై ప్రభావం చూపించటంలో నాటికల పాత్ర కీలకమన్నారు. భాష ఉన్నతికి చిరునామాగా, సామాజిక హితాన్ని కాంక్షిస్తూ ప్రజలకు విజ్ఞానాన్ని, వినోదాన్ని వాస్తవ పరిస్థితులను పంచే నాటికలకు పూర్వవైభవం రావాలని ఆకాంక్షించారు. వేదిక చైర్మన్ ముత్తవరపు సురేష్‌బాబు మాట్లాడుతూ ప్రేక్షకుల నాడి పట్టుకున్న కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని, కళాకారులు, రచయితలు కూడా మారే కాలంతోపాటే మరిన్ని నాటికలను ఆవిష్కరించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. సన్మాన గ్రహీత నాయుడు గోపి మాట్లాడుతూ కళాపరిషత్‌లే కాక ప్రభుత్వాలు, ప్రైవేట్ టీవి చానల్స్, ఆధ్యాత్మిక సంస్థలు కూడా నాటికలకు ప్రోత్సాహం అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. పీవి మల్లికార్జునరావు మాట్లాడుతూ భారతీయ సమాజాన్ని పట్టిపీడిస్తున్న అనేక వివక్షలను నాటకం, నాటికలు ఎండగట్టాయని, సామాజిక వివక్షలకు వ్యతిరేకంగా నాటిక ప్రదర్శనలు ఓ ఉద్యమమే చేసిందన్నారు. అలాంటి కళలను, కళాకారులను కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. కార్యక్రమంలో అనంతవరం కళాపరిషత్ అధ్యక్షుడు గుదే పాండురంగారావు, గుదే తారకరామారావు, మద్దినేని జయరామకృష్ణ, పెడవల్లి శ్రీనివాసరావు, పోపూరి శివసుబ్బారావు, నిమ్మల సాంబశివరావు, పెడవల్లి వెంకటేశ్వర్లు, మండవ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కోరికలే శత్రువులుగా..
మూడో నాటికగా వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వారి నిశి నాటికలో మదిని తొలిచే కోరికలు మనిషిని ఒక పట్టాన నిలవనియ్యవు. కోరికల మత్తులో ఏమాత్రం భయం లేకుండా అక్రమసంబంధాలకు పాల్పడతారు. సాగినంత కాలం భాగానే సాగినా ఏదో ఒక రోజు తమ తప్పులను కప్పి పుచ్చుకోవటానికి తాను చేసే ప్రయత్నాల్లో విచక్షణ కూడా కోల్పోతాడు. ఆ సమయంలో ఎన్నో చేయరాని తప్పులు చేసి కష్టాల ఊబిలో కూరుకుపోతాడు. ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతాయి వాటికి కారణాలేంటి, జరిగాక వాటి ప్రతిఫలం ఏంటి అనేదే నిశి నాటిక సారాంశం.
మంచితనం వికసించినప్పుడు..
తొలినాటికగా మైత్రి కళానిలయం విజయవాడ వారి బ్రహ్మస్వరూపం నాటికలో మంచితనం వికసించినప్పుడు అందరూ మంచివాళ్లే కనిపిస్తారు. ఆ ప్రపంచంలో మనకు ఆత్మీయతలు, మమకార మాధుర్యాలు పరిభ్రమిస్తుంటాయి పరిపూర్ణమైన మనసుతో చూడగలిగితే మనకు నచ్చిన జీవితం మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తోంది. కఠినమైన సందర్భాల్లో విధి విరోధిగా మారిన వేళల్లో మనం నిస్సహాయులుగా మిగిలిపోతున్నప్పుడు సాక్షాత్తూ ఆ బ్రహ్మస్వరూపమే ఆవహించి ధర్మాన్ని చెప్తుందంటూ ఇతివత్తంగా నాటిక సాగింది.
గెలిచేదంతా నిజం కాదు..
రెండో నాటికగా యంగ్ థియేటర్ విజయవాడ వారి 27వ మైలురాయి నాటికలో.. నిజం గెలుస్తుంది అన్నది నిజమే కానీ, గెలిచేదంతా నిజం మాత్రం కాదు. ఇప్పుడున్న చాలా మంది న్యాయవాదులు తమ క్లయింట్లను గెలిపించుకునేందుకు అడ్డమైన కేసులు వాదిస్తున్నారు. సమాజానికి కీడు చేసే కేసులు వాదించకుండా ఉండటమే ఉత్తమమం అనే ప్రధానాశంగా రాయబడ్డ నాటిక 27వ మైలురాయి.
Comments
Please login to add a commentAdd a comment