అక్రమ నిర్మాణాలు తొలగిస్తాం
చీరాల: తీరం ఆక్రమణలకు నిలయంగా మారింది. సునామీ వంటి విపత్తులు వస్తే బాపట్ల జిల్లాలోని సూర్యలంక, ఓడరేవు, రామాపురం, కఠారివారిపాలెం, పొట్టి సుబ్బయ్యపాలెం, ఉమ్మడి జిల్లాల పరిధిలోని కొత్తపట్నం తీర ప్రాంతాలు విపరీతంగా నష్టపోతాయి. కొన్నేళ్లుగా తీరప్రాంతం అక్రమ రొయ్యల యూనిట్లు, రిసార్టులకు నిలయంగా మారింది. సముద్రం ఒడ్డునే ఎటువంటి అనుమతులు లేకుండా ప్రాసెసింగ్ యూనిట్లు, రిసార్టులు విచ్చలవిడిగా వెలిశాయి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, రెవెన్యూ, పంచాయతీ, టూరిజం వంటి 15 శాఖల అనుమతులు లేకుండానే నిర్మాణాలు చేపట్టారు. సముద్రానికి 250 మీటర్లు పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలు, 500 మీటర్ల పరిధిలోని ఇళ్లను తొలగించాలని సీఆర్‌జెడ్ నిబంధనలున్నాయి. వాటిని పట్టించుకొనే వారు కరువయ్యారు. విపత్కర పరిస్థితిని గుర్తించిన కేంద్ర ప్రభుత్వం సీఆర్‌జెడ్ పరిధిలో విస్తరించిన అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో జిల్లాలో ఐఆర్‌జీ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు అనుమతులు లేకుండా నిర్మించిన రిసార్టులు, హోటళ్లు, అక్రమ లేఅవుట్లపై అధికారులు కొరడా ఝుళిపించారు. ఆదివారం ఉదయం రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్‌ను తొలగించారు.
ప్రభుత్వ భూముల ఆక్రమణ
ఓడరేవు నుంచి వేటపాలెం మండలం పొట్టిసుబ్బయ్యపాలెం వరకు సముద్ర తీరం వెంట ప్రభుత్వ భూములను యథేచ్ఛగా ఆక్రమించి రిసార్టులు నిర్మించారు. ఆక్రమణదారులకు రెవెన్యూ, పంచాయతీ అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయి. విద్యుత్ శాఖ అధికారులు కూడా కాసులకు కక్కుర్తి పడి విద్యుత్ లైన్లు, మీటర్లు కూడా అందించారు. వాస్తవంగా నూతన కట్టడం కట్టాలంటే ముందుగా దానికి సంబంధించిన ప్లాన్ ఆ పరిధిలోని గ్రామ పంచాయతీ అప్రూవల్ తీసుకోవాలి. అనంతరం విద్యుత్ మీటరు ఏర్పాటుకు గ్రామ పంచాయతీ కార్యదర్శి ఎన్‌ఓసీ ఇవ్వాల్సి ఉంది. రిసార్ట్ యజమానులు ఈ నిబంధనలు పాటించిన దాఖలాలు లేవు. గ్రామ పంచాయతీ కార్యదర్శులు, విద్యుత్ శాఖ అధికారులు భారీగా ముడుపులు తీసుకొని అనుమతులు మంజూరు చేస్తున్నారు.
అనుమతి లేని లేఅవుట్లు కోకొల్లలు
వేటపాలెం మండలం పరిధిలోని రామాపురం, కఠారివారిపాలెం, పొట్టిసుబ్బయ్యపాలెం తీర ప్రాంతంలో అనుమతులు లేకుండా అక్రమ లేఅవుట్లు దాదాపు 20 వరకు వెలిశాయి. వీటిని నియంత్రించాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు.
సీఆర్‌జెడ్ పరిధిలో అక్రమ నిర్మాణాలు అనుమతులు లేకుండా రిసార్టుల నిర్మాణాలు అక్రమ నిర్మాణాలను తొలగించాలని ప్రభుత్వం ఆదేశాలు ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లను తొలగించిన రెవెన్యూ అధికారులు
సీఆర్‌జెడ్ పరిధిలోని అక్రమ నిర్మాణాలు గుర్తిస్తున్నాం. పంచాయతీ, పొల్యూషన్ బోర్డుల అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టారు. వీటన్నింటినీ తొలగించేందుకు నోటీసులు జారీచేశాం. సముద్రానికి 250 మీటర్ల పరిధిలోని అన్ని నిర్మాణాలను తొలగించాలని ఆదేశాలున్నాయి.
–చంద్రశేఖర్‌నాయుడు, ఆర్డీవో, చీరాల
Comments
Please login to add a commentAdd a comment