పంగులూరులో ఇండోర్ స్టేడియం
జె.పంగులూరు: పంగులూరులో ఇండోర్ స్టేడియం ఏర్పాటు కోసం ఖేల్ ఇండియా ప్రమాణాలకు అనుగుణంగా ప్రతిపాదనలు సిద్ధం చేసి కలెక్టర్‌కు పంపించాలని ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అనిమిని రవినాయుడు సూచించారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈ నెల 28 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జరగనున్న 38వ జాతీయ పోటీల్లో ఏపీ క్రీడాకారులు సత్తా చాటాలని ఆకాంక్షించారు. స్థానిక పంగులూరు జూనియర్ కళాశాలలో ఎస్‌ఆర్‌ఆర్ ఖోఖో అకాడమీ ఆధ్వర్యంలో రాష్ట్ర జట్టుకు నిర్వహిస్తున్న కోచింగ్ క్యాంపును మంగళవారం పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా జాతీయ స్థాయి క్రీడల్లో రాష్ట్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఖోఖో క్రీడాకారులను ఆయన పరిచయం చేసుకుకొని, అభినందించారు. ఏపీని క్రీడా రంగంలో అగ్రస్థానంలో నిలబెట్టాలన్నారు. క్రీడాకారుల భవిష్యత్తే ధేయంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన క్రీడా పాలసీ తీసుకొచ్చిందని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగ కల్పనలో స్పోర్ట్స్ కోటాను 2 నుంచి 3 శాతం పెంచిందని తెలిపారు. క్రీడా ప్రోత్సాహకాలు భారీగా పెంచామని తెలిపారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఖోఖో క్రీడకు పెట్టింది పేరని జిల్లా నుంచి మరింత మంది అంతర్జాతీయ క్రీడాకారులు తయారు కావాలని ఆయన పిలుపునిచ్చారు.
స్పాన్సర్లు.. క్రీడాకారులను ప్రోత్సహించాలి
కార్యక్రమానికి ముందు అధికారులతో జరిగిన సమావేశంలో రవినాయుడు .. స్పోర్ట్ అథారిటీ అధికారుల నుంచి బాపట్ల జిల్లా సమాచారం అడిగి తెలుసుకున్నారు. ముందుగా అద్దంకి డిగ్రీ కళాశాల సమీపంలో శాప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇండోర్ కోర్టుపై అరా తీశారు. పట్టణానికి 5 కిలో మీటర్లు దూరంగా ఉండటం వలన అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తెలిపారు. క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహంతోపాటు, క్రీడా అభివృద్ధికి స్పాన్సర్లు ముందుకు రావాలని అన్నారు.
విద్యార్థులు క్రీడల వైపు మొగ్గు చూపాలి
అనంతరం రాష్ట్ర ఖోఖో అసోసియేషన్ చైర్మన్ బాచిన చెంచుగరటయ్య మాట్లాడుతూ పాఠశాల స్థాయినుంచే విద్యార్థులు క్రీడల్లో రాణించే విధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు. యువత డ్రగ్స్, గంజాయికి బానిసలయ్యారని, వాటికి దూరంగా ఉండాలంటే విద్యార్థులను క్రీడల వైపు మొగ్గు చూపాలన్నారు. అలాగే క్రీడల అభివృద్ధికి శాప్ కృషి అభినందనియం అని తెలిపారు.
ఖోఖో క్రీడాకారునికి అభినందనలు
ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో జరిగిన ఖోఖో వరల్డ్ కప్ చాంపియన్ షిప్ విజేతగా నిలిచిన భారత జట్టులో ఏపీ నుంచి ప్రాతినిధ్యం వహించిన పంగులూరు ఖోఖో క్రీడాకారుడు పి.శివారెడ్డిని శాప్ చైర్మన్ రవినాయుడు అభినందించారు. డీఎస్‌డీఓ పాల్ కుమార్, జిల్లా కోచ్‌లు, రాష్ట్ర మాజీ స్కూల్ గేమ్స్ సెక్రటరీ శీనయ్య, మల్లవరం పెద్దలు బాలిన సుబ్బారావు, కర్రి సుబ్బారావు, రావూరి రమేష్, జెడ్పీటీసి రాయిణి వెంకటసుబ్బారావు, వీరరాఘవయ్య, కె.హనుమంతరావు పాల్గొన్నారు.
ప్రతిపాదనలు పంపాలన్న ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ రవినాయుడు పంగులూరు ఖోఖో కోచింగ్ క్యాంపు సందర్శన స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంపు క్రీడా ప్రాంగణాల అభివృద్ధికి సీఎస్‌ఆర్ నిధులు
Comments
Please login to add a commentAdd a comment