జల్సాలకు అడ్డా తీరం
చీరాల: పర్యాటకంగా అభివృద్ధి చెందిన చీరాల ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో జల్సాలకు అడ్డాగా మారింది. శివారు కాలనీలు, కుందేరు ఒడ్డున పేకాట స్థావరాలు, తీరప్రాంతంలో యథేచ్ఛగా కోడి పందేలు, నెంబర్లాట, తక్కువ ధరకే బంగారం పేరుతో ర్యాప్‌లు వంటి మోసాలు జోరుగా సాగుతున్నాయి. సీఎం చంద్రబాబునాయుడు పేరుతో ఆన్‌లైన్ మోసాలు ఇక్కడ నిత్యం జరుగుతున్నా అడ్డుకట్ట వేసేవారు కానరావడంలేదు. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకోవాల్సిన పోలీసుల్లో కొందరు అక్రమార్కులు, నేరగాళ్లు, జూదగాళ్లకు అండగా నిలబడుతున్నారు.
పర్యాటకుల ముసుగులో కోడి పందేలు
పర్యాటక రంగంలో దూసుకెళ్తున్న చీరాల్లోని తీర ప్రాంతంలో జల్సాలకు కొదువేలేదు. ఇక్కడ ఉన్న రిసార్ట్‌లు, హోటళ్లలో జల్సాలకు తక్కువేమీ కాదు. తీర ప్రాంత గ్రామాలైన రామాపురం, వాడరేవు, పొట్టిసుబ్బయ్యపాలెంలో పర్యాటకులు అధికంగా వస్తుంటారు. పర్యాటకుల ముసుగులో కోడి పందేలు జోరుగా జరుగుతూనే ఉన్నాయి. కొన్ని రిసార్ట్‌లు పేకాట ఆడేవారికి, ఇతర అసాంఘిక కార్యకలాపాలు చేసే వారికి ప్రత్యేక వసతులు, ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం ఉంది.
తక్కువ ధరకే బంగారం పేరుతో మోసాలు
తక్కువ ధరకే బంగారం ఇస్తామని డబ్బులు తీసుకుని మోసాలు చేసే ర్యాప్ ముఠాలు మళ్లీ జడలు విప్పాయి. గడిచిన ఐదేళ్లలో ర్యాప్ ముఠాలపై అప్పటి పోలీసులు ఉక్కుపాదం మోపారు. కానీ ప్రస్తుతం పోలీసులు ర్యాప్ ముఠాలు, పేకాట డాన్‌లు, కోడి పందేల నిర్వాహకులతో లాలూచీ పడి పట్టించుకోవడం లేదు. నాలుగు రోజుల కిందట చీరాల రూరల్ స్టేషన్ పరిధిలో తక్కువ ధరకే బంగారం పేరుతో రూ.32 లక్షల ర్యాప్ జరిగింది. బాధితులు లబోదిబోమంటున్నా పట్టించుకోవడంలేదు.
లక్షల్లో లావాదేవీలు..
వివిధ రకాల జూదాల్లో రోజుకు సుమారు రూ.15 లక్షలు చేతులు మారుతున్నాయనే సమాచారం ఉంది. ఇలా నెలకు సుమారు రూ.4 కోట్ల మేర లావాదేవీలు జరుగుతున్నట్లే. అసాంఘిక కార్యకలాపాలను అడ్డుకునేందుకు ప్రతీ స్టేషన్‌లో స్పెషల్ బ్రాంచ్, అనుమతి లేని ఐడీ పార్టీ పోలీసులున్నారు. వీరు పాత నేరస్తులు, పేకాట, నాటుసారా, జూదాలు, అక్రమాలపై నిఘా ఉంచి ఉన్నతాధికారులకు సమాచారాన్ని అందించి నేరాలను అడ్డుకోవాలి. కానీ పట్టించుకోవడం లేదు.
పోస్టుకు ఇంతనే లెక్క..
ప్రత్యేక పోలీసు విభాగంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అక్రమాలు చేసే వారితో లాలూచీ పడి నెలకు స్టేషన్‌కు రూ.30 వేలు, హెడ్‌కానిస్టేబుల్‌కు రూ.10 వేలు, కానిస్టేబుల్ హోంగార్డులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు, ప్రత్యేక కానిస్టేబుల్‌కు రూ.20 వేలు, అనధికార ఐడీ పార్టీ సభ్యులకు రూ.20 వేలు చొప్పున ఇస్తున్నట్లు సమాచారం.
ఆపేదెవరు?
చీరాల నియోజకవర్గం పరిధిలోని చీరాల ఒన్‌టౌన్, చీరాల టూటౌన్, చీరాల రూరల్ సర్కిళ్లు, ఈపురుపాలెం, వేటపాలెం పోలీస్‌స్టేషన్లున్నాయి. చీరాల టూటౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో రామ్‌నగర్, 300 కాలనీ, కంపెనీ వెనుక ఉన్న ప్రదేశంలో పేకాట, కోత ముక్కకు అడ్డాగా మారింది. కుందేరు ఆనుకుని ఉన్న ప్రదేశంలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు పేకాట, కోత ముక్క జోరుగా సాగుతోంది. ఇక్కడ రోజుకు రూ.8 నుంచి రూ.10 లక్షల మేర చేతులు మారుతున్నాయి. ఇక్కడ పేకాట నిర్వహిస్తున్న వారిని నుంచి టూటౌన్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ హెడ్‌కానిస్టేబుల్, హోంగార్డు, ప్రత్యేక కానిస్టేబుల్ నెలకు రూ.50 వేల మేర మామూళ్లు తీసుకుని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.
చీరాల తీర ప్రాంతంలో
రెచ్చిపోతున్న అసాంఘిక శక్తులు
ఖాకీల కనుసన్నల్లోనే పేకాట
స్థావరాలు
మళ్లీ మొదలైన ర్యాప్‌లు, కోడిపందేలు
Comments
Please login to add a commentAdd a comment