యార్డులో ఉచిత మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు మార్కెట్ యార్డులో రైతు ఉచిత మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత, జిల్లా జాయింట్ కలెక్టర్ ఎ.భార్గవ తేజలు గురువారం ప్రారంభించారు. ఉదయం 10.45 గంటలకు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, గుంటూరు తూర్పు, పశ్చిమ, ప్రత్తిపాడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు నసీర్ అహ్మద్, గళ్లా మాధవి, బూర్ల రామాంజనేయుల చేతుల మీదుగా రైతు ఉచిత భోజన పథకం ప్రారంభించాల్సి ఉంది. కానీ కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేలు ప్రారంభోత్సవానికి డుమ్మా కొట్టారు. దీంతో అప్పటికే అమానత్ పట్టి ఆధారంగా ఉచిత భోజనానికి రసీదులు పొందిన రైతులు మధ్యాహ్నం 12.10 గంటల వరకు భోజన శాల బయట పడిగాపులు కాయాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12.15 గంటలకు జాయింట్ కలెక్టర్ అక్కడకు చేరుకున్నారు. మార్కెటెంగ్‌శాఖ కమిషనర్ ఎం.విజయ సునీత రాక కోసం జాయింట్ కలెక్టర్ సుమారు 25 నిమిషాల పాటు వేచి చూడాల్సి వచ్చింది. మధ్యాహ్నం 12.40 గంటలకు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కమిషనర్ విజయ సునీత, జాయింట్ కలెక్టర్ భార్గవ్ తేజలు మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యతతో కూడిన రుచికరమైన భోజనాన్ని అందించాలని నిర్వాహకులకు సూచించారు. రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మార్కెటింగ్‌శాఖ సహాయ సంచాలకులు బి.రాజబాబు, యార్డు ఉన్నతశ్రేణి కార్యదర్శి వినుకొండ ఆంజనేయులు, యార్డు ఇన్‌చార్జి సుబ్రమణ్యం, అసిస్టెంట్ ఇన్‌చార్జి శ్రీకాంత్, యార్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భోజన శాల వద్ద రైతుల పడిగాపులు
కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేల డుమ్మా
Comments
Please login to add a commentAdd a comment