విద్యార్థులకు రహదారి భద్రతపై అవగాహన అవసరం
బాపట్ల: విద్యార్థులు రహదారి భద్రతపై అవగాహన ఉండాలని ఆర్టీఓ టి.కె.పరంథామరెడ్డి పేర్కొన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలలో భాగంగా గురువారం పిట్టలవానిపాలెంలోగల కేర్ యోగ, నేచురోపతి మెడికల్ కాలేజ్ విద్యార్థులకు రహదరి భద్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆర్టీఓ మాట్లాడుతూ విద్యార్థులు నిబంధనలు పాటిస్తూ మిగిలిన వారికి ఆదర్శంగా ఉండాలని అన్నారు. యువత ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారని, నిబంధనలు పాటించకపోవడమే అందుకు కారణమని పేర్కొన్నారు. చట్టాలు ఉన్నది ప్రజల రక్షణ కోసమేనని వాటిని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని అన్నారు. ద్విచక్రవాహనం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని, నాలుగు చక్రాల వాహనం నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని, సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని విద్యార్థులకు సూచించారు. మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ డి.బి.వి.రంగారావు మాట్లాడుతూ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం చట్టవిరుద్ధమని తెలిపారు. ప్రమాదాలు జరగడానికి గల పలు కారణాలను విద్యార్థులకు వివరించారు. రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ నరేంద్రకుమార్ ఫస్ట్ ఎయిడ్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సైకాలజిస్ట్ శ్రీమన్నారాయణ, కాలేజ్ యజమాని కిషోర్‌రాజు, కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సౌమ్య మహేష్ పాల్గొన్నారు.
ఆర్టీఓ టి.కె.పరంథామరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment