జాగ్రత్తలతో కంటి సమస్యలు దూరం
నరసరావుపేటటౌన్: సరైన పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవటంతోపాటు కంటి నిండా నిద్ర ఉంటే కంటి సమస్యలు దరిచేరవని 13వ అదనపు జిల్లా న్యాయ మూర్తి ఎన్. సత్యశ్రీ అన్నారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాలలో గురువారం నిర్వహించిన ఉచిత మెగా కంటి వైద్య శిబిరంలో ఆమె మాట్లాడారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలు, పెద్దలు కంటి సమస్యలను ఎదుర్కొంటున్నారన్నారు. పిల్లలు ఎక్కువగా టీవీ, సెల్‌ఫోన్‌లు చూడటం వలన సమస్యలు వస్తున్నట్లు తెలిపారు. ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే కంటి సమస్యల బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు. అనంతరం ఎంవీ రెడ్డి కంటి వైద్యశాల డాక్టర్ ఎల్. సృజన ప్రత్యేక అవసరాల పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి కళ్లజోళ్లు పంపిణీ చేశారు. పాఠశాల డైరెక్టర్ ఏపీవీ ఇందిర, సిబ్బంది పాల్గొన్నారు.
సౌత్ సెంట్రల్ రైల్వే న్యాయ సలహాదారుడిగా ఉల్లం
సత్తెనపల్లి: సౌత్ సెంట్రల్ రైల్వే న్యాయ సలహాదారుడిగా పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన హైకోర్టు సీనియర్ న్యాయవాది ఉల్లం శేషగిరిరావు నియమితులయ్యారు. ఈమేరకు న్యాయశాఖ సికింద్రా బాద్ న్యాయాధికారి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. తన నియామకానికి కృషి చేసిన కమతం కాశిరెడ్డి, పాపిరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉల్లం నియామకంపై ఏజీపీ బగ్గి నరసింహారావు, సీనియర్ న్యాయవాది పిన్నమనేని పాములయ్య, దివ్వెల శ్రీనివాసరావు, పలువురు న్యాయవాదులు తదితరులు హర్షం వెలిబుచ్చారు.
టీపీఎస్ సునీతకు టీపీఓగా పదోన్నతి
సత్తెనపల్లి: పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో టౌన్ ప్లానింగ్ సూపర్‌వైజర్‌గా విధులు నిర్వహిస్తున్న కె.సునీతకు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్‌గా పదోన్నతి లభించింది. ఈ మేరకు గురువారం రాత్రి టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ ఆర్.జె.విద్యుల్లత నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆమెను విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌కు బదిలీ చేశారు. పదోన్నతి పొందిన సునీతకు మున్సిపల్ కమిషనర్ కొలిమి షమ్మి, మున్సిపల్ మేనేజర్ ఎన్.సాంబశివరావు, టీపీఎస్ రిజ్వానా, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, అభినందనలు తెలిపారు.
ఐదుగురికి 22 నెలల జైలు శిక్ష
రూ.50 వేలు జరిమానా
నగరంపాలెం(గుంటూరు వెస్ట్): కట్న వేధింపులు, గృహహింస కేసులో ఐదుగురికి 22 నెలల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధి స్తూ గుంటూరు రెండో అదనపు సివిల్ జడ్జి కోర్టు (జూనియర్ డివిజన్) జడ్జి దీప్తి గురువారం తీర్పు వెలువరించారు. రామిరెడ్డినగర్‌లో ఉంటున్న ఓ మహిళ తన భర్త, మామ, బంధువులపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని ఫిబ్రవరి 12 2021న మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అప్పటి ఏఎస్‌ఐ ఎండీ.అసదుల్లాఖాన్ కేసు నమోదు చేశారు. అప్పటి ఎస్‌ఐ ఖాజీబాబు దర్యాప్తు చేసి చార్జ్‌షీట్ దాఖలు చేశారు. నేరం రుజువుకావడంతో భర్త, మామతోపాటు ముగ్గురు బంధువులకు 22 నెలల జైలు శిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. ఈ కేసులో న్యాయవాదులు, పోలీసులు సంయుక్తంగా కృషి చేయడం వల్లే నిందితులకు శిక్ష పడిందని ఎస్పీ సతీష్‌కుమార్ తెలిపారు.
మనోవేదనకు గురై విద్యార్థి ఆత్మహత్య
మంగళగిరి (తాడేపల్లిరూరల్): చదువు ఒత్తిడి తట్టుకోలేక మనోవేదనకు గురై ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంగళగిరి మండలంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మంగళగిరి మండలం కురగల్లులోని అమృత విశ్వవిద్యాలయ పీఠంలో ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్న కె.కె. నవదేవ్ (22) గురువారం హాస్టల్ రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నవదేవ్ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడని, మానసిక ఒత్తిడితో చదవలేకపోతున్నాని మనసు స్థిమితంగా ఉండడం లేదని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నట్లు పోలీసులు తెలిపారు. రెండు సూసైడ్ నోట్లు ఉన్నట్లు గుర్తించా మని పేర్కొన్నారు. నా చావుకు ఎవరూ కారణం కాదని ఆ సూసైడ్ నోట్‌లో రాసి ఉందని వివరించారు. ఘటనా స్థలానికి వెళ్లి పోలీసులు తోటి విద్యార్థులను విచారణ చేశారు. నవదేవ్ తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదు తీసుకుని కేసు నమోదు చే సి దర్యాప్తు చేస్తామని రూరల్ ఎస్‌ఐ వెంకట్ తెలిపారు.
ఊరబండి మన్నెయ్యపై పీడీ యాక్ట్
నరసరావుపేట: మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడు గ్రామానికి చెందిన ఊరబండి మన్నెయ్యపై పీడీ యాక్ట్ నమోదు చేిసినట్లు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గురువారం రాత్రి పేర్కొన్నారు. 2010 నుంచి 2024 ఎన్నికల వరకు అతనిపై 15 కేసులు నమోదయ్యాయని అన్నారు. హత్య, హత్యాయత్నం, ఎక్స్‌ప్లోజీవ్ కేసులతోపాటు ఎన్నికల రోజు, అనంతరం జరిగిన కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని వెల్లడించారు. సుమారు 15 కేసులలో నిందితుడైనందున పీడీ యాక్ట్ పెట్టినట్లు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment