గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క తొలగింపు
గుంటూరు మెడికల్: శుభ కార్యాయానికి వెళ్లి మద్యం మత్తులో తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతుకు అడ్డుపడి మూడు రోజులుగా అవస్థలు పడిన వృద్ధుడికి గుంటూరు జీజీహెచ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్యులు చికిత్స చేశారు. ముక్కను తొలగించి నొప్పి నుంచి విముక్తి కల్పించారు. గుంటూరుకు చెందిన 72 ఏళ్ల షేక్ అదంషఫీ మూడు రోజుల క్రితం బంధువుల ఇంట్లో శుభ కార్యానికి వెళ్లాడు. అక్కడ మద్యం తీసుకుని చికెన్ బిర్యానీ తింటున్న సమయంలో చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుంది. మూడు రోజులపాటు కనీసం మంచినీరూ తాగలేక అవస్థలు పడ్డారు. చికిత్స కోసం జీజీహెచ్‌కు వచ్చాడు. గ్యాస్ట్రో ఎంట్రాలజీ వైద్య విభాగాధిపతి డాక్టర్ అనుమల కవిత తొలుత ఎక్సరే తీశారు. ఆ తర్వాత ఎండోస్కోపి చేసి గొంతులో ఇరుక్కున్న చికెన్ ముక్క బయటకు తీశారు. బాధ నుంచి విముక్తి కల్పించారు. మూడు రోజుల పాటు చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఉండటం ద్వారా గొంతు లోపలి భాగంలో పుండ్లు ఏర్పడ్డాయని వైద్యులు తెలిపారు.
రైలు ఢీకొని వృద్ధుడు మృతి
చీరాల రూరల్: బొకోరో ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి చోటుచేసుకోగా గురువారం వెలుగు చూసింది. జీఆర్పీ ఎస్సై సీహెచ్ కొండయ్య తెలిపిన వివరాల మేరకు...చీరాల–వేటపాలెం రైల్వేస్టేషన్ల మధ్య ఎంజీసీ హౌసింగ్ కాలనీ సమీపంలో ఎగువ లైన్‌పై రైలు ఢీకొని వృద్ధుడు మృతి చెందాడనే సమాచారంతో సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించినట్లు చెప్పారు. మృతుని వద్ద ఎలాంటి సమాచారం లభించలేదని చెప్పారు. మృతుడి వయస్సు 65 సంవత్సరాలు ఉంటాయని, 5.5 ఎత్తుతో చామనఛాయ రంగు కలిగి ఉన్నాడని.. ఛాతీ మధ్యలో పుట్టుమచ్చ ఉన్నదని చెప్పారు. మృతుడి శరీరంపై ఆకుపచ్చ రంగు పట్టీలుగల నిండు చేతులు షర్ట్, బులుగు, నలుపు, ఆకుపచ్చ రంగు గడులు గల లుంగీ ఉన్నట్లు చెప్పా రు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. మృతుడి ఆధారాలు ఎవరికై నా లభిస్తే 9440627646 నంబర్‌కు సమాచారం అందించాలని సూచించారు.
ప్రహరీని ఢీకొట్టిన టిప్పర్
కూలిన గోడ..నిలిచిన ట్రాఫిక్
చీరాలటౌన్: ఓ టిప్పర్ డ్రైవర్ వేగంగా వచ్చి ఓ ఇంటి ప్రహరీని ఢీకొట్టడంతో అది కూలిపోయింది. రోడ్డు మార్జిన్ ఉందనే అపోహతో వేగంగా వచ్చి రోడ్డు పక్కన ఉన్న ఇంటి ప్రహరీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అంతేగాక రోడ్డు పక్కన ఉన్న చెట్టును కూడా ఢీకొట్టడంతో చెట్టు కొమ్మలు విరిగి ప్రధాన రోడ్డుపై పడి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన గురువారం చీరాల–బాపట్ల ప్రధాన రహదారిలోని శాంతినగర్ వద్ద చోటుచేసుకుంది. తోటవారిపాలెంలో నిర్మాణం చేస్తున్న జాతీయ రహదారికి కావాల్సిన కంకరను తీసుకెళుతున్న టిప్పర్ డ్రైవర్ అజాగ్రత్త వల్ల ఇలా జరిగింది. రోడ్డుపై ప్రజలు ఎవ్వరు లేకపోవడంతో ప్రమాదంలో ప్రాణ నష్టం జరగలేదు.
తగ్గిన పంటల విస్తీర్ణం
గుంటూరు రూరల్: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో ప్రధాన పంటల విస్తీర్ణం తగ్గినట్లుగా గణాంకాలు స్పష్టం చేస్తున్నాయని లాంఫాం వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ డాక్టర్ వై.రాధ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అయినా నూతన సాంకేతికత పద్ధతులను ఆచరించటం వల్ల ఉత్పత్తిలో గణనీయమైన లోటు నమోదు కాలేదని పేర్కొన్నారు. పంటల ధరలు మాత్రం నిరాశజనకంగానే ఉన్నాయని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment