అద్దె బకాయిలు రాక 8 నెలలు
కొత్తగూడెంటౌన్: అంగన్‌వాడీలకు అద్దె బిల్లుల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. చాలీచాలని వేతనాలతో ఇల్లు గడవడమే కష్టం అనుకుంటే అద్దెలు ఎలా చెల్లించాలని 8 నెలలుగా పెండింగ్ బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నా మని అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దెలు కడతారా? లేదా ఖాళీ చేస్తారా?.. భవనాలకు తాళం వేస్తామని ఓనర్లు ఒత్తిడిని చేస్తున్నారని, సెంటర్ల నిర్వహణకు ఇబ్బందులు పడాల్సి వస్తోందని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
785 సెంటర్లు అద్దె భవనాల్లోనే..
జిల్లాలోని మెయిన్ అంగన్‌వాడీ సెంటర్‌లు 2,060 ఉన్నాయి. అందులో 782 అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు ఉండగా మరో 493 కేంద్రాలు ఉచిత భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇక 785 సెంటర్లను అద్దె భవనాల్లో నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్‌కు ఆయా ఏరియాలను బట్టి రూ.1000 నుంచి రూ.4 వేల వరకు అద్దెలు చెల్లించాల్సి ఉంది. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఒకటి, రెండు లేదా మూడు గదుల్లో నిర్వహణ కొనసాగుతోంది. అయితే, ఏనెలకానెల అద్దె బిల్లులు ఎప్పుడు కూడా మంజూరు కావడం లేదు. 2023 సెప్టెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు ఆరు నెలల అద్దె బకాయిలు రూ.84,91,420ను ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రభుత్వం చెల్లించింది. ఆపై మళ్లీ ఎవరూ పట్టించుకోలేదు. దీంతో ఇక ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ వరకు ఎనిమిది నెలల అద్దె బిల్లులు అంగన్‌వాడీ సెంటర్లకు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఈ విషయంలో ఐసీడీఎస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని అంగన్‌వాడీ టీచర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అద్దె బకాయిలు రాకపోవడంతో యాజమానుల ఒత్తిడితో తాము ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి అద్దె బకాయిలన్నీ చెల్లించడమే కాక, ఇక నుంచి ఏనెలకానెల విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
గత ఫిబ్రవరిలో ఆరు నెలల
అద్దె విడుదల
ఆ తర్వాత 785 అంగన్‌వాడీలకు
మళ్లీ బిల్లులు పెండింగ్..
యజమానుల ఒత్తిడితో
ఇబ్బంది పడుతున్న టీచర్లు
ఉన్నతాధికారులకు నివేదిస్తాం..
అంగన్‌వాడీ సెంటర్ల అద్దె బకాయిలు కొంత మేర ఈ ఏడాది ఫిబ్రవరిలో చెల్లించాం. ఇంకా ఎనిమిది నెలల బకాయిలు ఉన్నాయి. ఈ విషయమై ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తాం. నిధులు మంజూరు కాగానే చెల్లిస్తాం.
–స్వర్ణలత లెనీనా, జిల్లా సంక్షేమ శాఖ అధికారి
Comments
Please login to add a commentAdd a comment