టిప్పర్, లారీ ఓనర్ల అసోసియేషన్ ఎన్నికలకు బ్రేక్
కొత్తగూడెంఅర్బన్/కొత్తగూడెంటౌన్/కొత్తగూడెంరూరల్: సింగరేణి సంస్థలో టిప్పర్, లారీ ఓనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు జరగకుండా అడ్డుకోవడం సరికాదని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్రా కామేశ్ పేర్కొన్నారు. ఎన్నికలు నిర్వహించేందుకు కొత్తగూడెం బుధవారం సీఈఆర్ క్లబ్‌లో సిద్ధమవుతుండగా కామేశ్‌తో పాటు పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాయకులను రెండు వర్గాలుగా విడగొట్టి నెలల తరబడి తిప్పుకుంటున్నా కొందరు పెత్తనం కోసం యత్నిస్తున్నారని తెలిపారు. కాంగ్రెస్ నాయకుడు జేబీ శౌరీని కలిసి మాట్లాడాక ఇరువర్గాలు సంప్రదించి ఎన్నికల నిర్వహణకు నిర్ణయించారని చెప్పారు. ఆపై నామినేషన్ల స్వీకరణ, తదితర ప్రక్రియలు పూర్తిచేసి గురువారం సీఈఆర్ క్లబ్‌లో ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తే పర్యవేక్షకులుగా వెళ్లిన తనతో పాటు మారపాక రమేశ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు. పారదర్శకంగా జరుగుతున్న ఎన్నికను అడ్డుకోవడం సరికాదన్నారు. కాగా, కామేశ్, రమేశ్‌తో పాటు బూర్గుల అనిల్‌కుమార్, తానంగి రవికుమార్, మైల చైతన్య, పెండ్యాల శ్రీనివాస్, దువ్వ సంపత్‌కుమార్, కాంటాత్మక ముకేశ్, నారా మహేందర్, కోలా నాగవర్మ, పలువురు లారీ ఓనర్లు, డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకునే సమయాన రసాభాసగా మారింది. అయితే, అనుమతి లేకుండా ఎన్నిక నిర్వహిస్తుండటంతో వారిని అదుపులోకి తీసుకుని ఆ తర్వాత సొంత పూచీకత్తుపై విడుదల చేశామని సీఐ కరుణాకర్ వెల్లడించారు. కాగా, లారీ ఓనర్ అసోసియేషన్లకు సంబంధించి రెండు వర్గాల్లో యజమానులు ఐక్యంగా ఉన్నందున అవాంతరాలు లేకుండా ఎన్నికలు జరిగేలా చూడాలని డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య సూచించారు. కొత్తగూడెంలోని పార్టీ కార్యాలయంలో నాయకులతో సమావేశమైన ఆయన మాట్లాడుతూ కొన్ని పార్టీల నాయకులు చిచ్చు పెట్టేలా వ్యవహరిస్తున్నందున యజమానులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో నాయకులు జేబీ శౌరీ, గౌస్, ఉస్మాన్, గడ్డం రాజశేఖర్, దావూద్ పాల్గొన్నారు.
అనుమతి లేదంటూ అడ్డుకున్న పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment