రోడ్డెక్కిన పత్తి రైతులు
● కొనుగోళ్లు నిలిపివేయడంతో ప్రధాన రహదారిపై ధర్నా ● ఆంక్షలు తొలగించాలని కొనుగోళ్లకు రాని వ్యాపారులు ● అధికారుల హామీతో విరమణ
జూలూరుపాడు: కమీషన్ తీసుకోవద్దని, పత్తి క్వింటాకు రెండు కిలోల తారం తీయొద్దని అధికారులు ఆంక్షలు విధించడంతో వ్యాపారులు బుధవారం స్థానిక ఉప మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లను నిలిపివేశారు. అయితే, ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాము వాహనాల్లో పత్తి తీసుకొచ్చాక ఇలా చేయడం సరికాదంటూ రైతులు తల్లాడ – కొత్తగూడెం ప్రధాన రహదారిపై ధర్నా చేపట్టారు. ఓ పక్క దిగుబడి లేక, ధర రాక ఇబ్బంది పడుతున్న తమను మరింత ఇక్కట్లకు గురిచేయొద్దని డిమాండ్ చేశారు. రైతులకు సీపీఎం, సీపీఐ నాయకులు మద్దతు పలకగా రెండు వైపులా పెద్దసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే, ట్రాఫిక్‌లో నిలిచిపోయిన బీఆర్‌ఎస్ నాయకుడు కోనేరు సత్యనారాయణ రైతులతో మాట్లాడి విషయాన్ని కలెక్టర్ పాటిల్‌కు ఫోన్‌లో వివరించారు. అంతలోనే పత్తి కొనుగోళ్లు జరిగేలా చర్యలు తీసుకుంటామని మార్కెట్ అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. సీపీఎం, సీపీఐ మండల కార్యదర్శులు యాసా నరేశ్, గుండెపిన్ని వెంకటేశ్వర్లు, నాయకులు గార్లపాటి వెంకటి, గడిదేశి కనకరత్నం, ఎస్కే చాంద్‌పాషా, ఇల్లంగి సీతారాములు తదితరులు పాల్గొన్నారు.
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
రైతులను ఇబ్బంది పెట్టకుండా నిబంధనల మేరకు పత్తి కొనుగోలు చేయాలని కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ సూచించారు. జూలూరుపాడులో రైతులు ఆందోళన చేపట్టిన విషయం తెలియడంతో ఆయన చేరుకున్నారు. అప్పటికే రైతులు ఆందోళన విరమించగా, పత్తి కొనుగోళ్లు మొదలయ్యాయి. ఈ మేరకు వ్యాపారులతో మాట్లాడిన ఆయన ఏదైనా సమస్య ఉంటే రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వాలే తప్ప కొనుగోళ్లు నిలిపివేయొద్దని హెచ్చరించారు. అలాగే, మార్కెటింగ్ శాఖ ఖమ్మం జిల్లా అధికారి ఎం.ఏ.అలీం కూడా వచ్చి కొనుగోళ్లను పరిశీలించి వ్యాపారులతో సమావేశమయ్యారు. కమీషన్, తరుగు సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రైతులు 8 నుంచి 12 శాతం మేర తేమ ఉండేలా పత్తి తీసుకొస్తే మద్దతు ధర లభిస్తుందన్నారు. కాగా, ఖమ్మం జిల్లాలో తొమ్మిది కేంద్రాలు ఇప్పటి వరకు 5 వేల మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశాయని తెలిపారు. ఏన్కూరు మార్కెట్ కార్యదర్శి బజారు, సూపర్‌వైజర్ రామారావు, వ్యాపారులు పెండ్యాల రామనర్సింహారావు, తొండెపు నవీన్, ఎస్‌కే.అన్వర్, ఉడుతా వెంకటేశ్వర్లు, కొదుమూరి రమేశ్, కమలాకర్, ఎస్‌డీ యాసిన్, తొండెపు సుబ్బారావు, దుగ్గిన్ని బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment