భవనాల నిర్మాణమెప్పుడో..?
చుంచుపల్లి: పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం 2016లో కొత్త జిల్లాలతోపాటు కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేసింది. జిల్లాలో గతంలో ఉన్న పాత 17 మండలాలకు తోడు మరో ఆరు.. చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్, అన్నపురెడ్డిపల్లి, ఆళ్లపల్లి, కరకగూడెం కొత్త మండలాలుగా ఆవిర్భవించాయి. ఇవి ఏర్పడి ఏడేళ్లయినా కార్యాలయాలకు పక్కా భవనాలు, అధికారులు, సిబ్బంది కొరత వంటి సమస్యలు ఇంకా తొలగిపోలేదు. ఫర్నిచర్‌తోపాటు ఇతర మౌలిక వసతులు కల్పించలేదు. ప్రభుత్వ పాఠశాలల్లో ఎంపీడీఓ కార్యాలయాలు, అద్దె భవనాలు, సింగరేణి క్వార్టర్లలో తహసీల్దార్ కార్యాలయాలు, రైతు వేదికల్లో వ్యవసాయశాఖ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇక్కడ పనిచేసే సిబ్బంది అరకొర వసతుల నడుమ ఇరుకు గదుల్లో అవస్థ పడుతున్నారు.
కొత్త మండలాల కార్యాలయాలను పరిశీలిస్తే..
● ఆళ్లపల్లి మండలం గుండాల నుంచి 12,268 మంది జనాభాతో 10 గ్రామ పంచాయితీలుగా విడిపోయింది. ఇక్కడ తహసీల్దార్ కార్యాలయం ప్రభుత్వ వెటర్నరీ భవనంలో, మండల పరిషత్ కార్యాలయం ప్రభుత్వ పాఠశాలలో అరకొర సౌకర్యాల మధ్య కొనసాగుతున్నాయి. ఇతర శాఖల కార్యాలయాలకు భవనాలు లేవు.
● అన్నపురెడ్డిపల్లి మండలం 21,130 మంది జనాభాతో 10 గ్రామ పంచాయతీలతో కొత్తగా ఏర్పడింది. తహసీల్దార్ కార్యాలయం సోషల్ వెల్ఫేర్ భవనంలో, ఎంపీడీఓ ఆఫీసు సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల భవనంలో కొనసాగుతున్నాయి. ఐకేపీ, వ్యవసాయశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లో ఏర్పాటు చేశారు.
● కరకగూడెం మండలం 15,221 మంది జనాభా 16 గ్రామపంచాయతీలతో ఆవిర్భవించింది. ఇక్కడ ఆయుర్వేద ఆస్పత్రి భవనంలో తహసీల్దార్ కార్యాలయం, గిరిజన సొసైటీ భవనంలో ఎంపీడీఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఐకేపీ, సొసైటీ కార్యాలయాలు ఇంకా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.
● చుంచుపల్లి మండలం 18 గ్రామ పంచాయతీల పరిధిలో 42,290 మంది జనాభాతో ఏర్పడింది. ఇక్కడ మండల పరిషత్ కార్యాలయం పాత ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయంలో తహసీల్దార్ కార్యాలయం పాడుబడిన సింగరేణి క్వార్టర్‌లో కొనసాగుతోంది. మిగతా శాఖల కార్యాలయాలు కొన్ని అద్దె భవనాల్లోనే ఏర్పాటు చేశారు.
● లక్ష్మీదేవిపల్లి మండలం 38,093 మంది జనాభాతో 31 గ్రామ పంచాయతీలతో మండలంగా ఏర్పాటు చేశారు. ఎంపీడీఓ కార్యాలయం ప్రభుత్వ పాఠశాల భవనంలో ఏర్పాటు చేయగా, తహసిల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగుతోంది.
● సుజాతనగర్ మండలం 27,989 మంది జనాభాతో 20 పంచాయతీలతో ఏర్పడింది. ఎంపీడీఓ, తహసీల్దార కార్యాలయాలను పాత ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనంలో కొనసాగుతున్నాయి. మిగతా శాఖలకు పక్కా భవనాలు లేవు. ఐకేపీ, వ్యవసాయశాఖ కార్యాలయాలు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి.
ఏడేళ్లుగా ఇరుకుగదుల్లో కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలు
ప్రతిపాదనలు చేసినా నిర్మాణానికి నోచుకోని పక్కా భవనాలు
కొత్త మండలాల్లో
మౌలిక వసతుల కొరత
కార్యరూపం దాల్చని భవన నిర్మాణాలు
కొత్త మండలాల్లో ఒక్కో భవనానికి రూ.కోటి చొప్పున వెచ్చించి సమీకృత కార్యాలయ భవనాలు నిర్మించాలని అప్పట్లో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ భవనాల్లో తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంపీఓ కార్యాలయాలు పని చేయాలని సూచించింది. ప్రతిపాదన తీసుకొచ్చి ఏళ్లు గడుస్తున్నా కొన్ని చోట్ల భూ సేకరణ జరగ్గా, మరికొన్ని చోట్ల ముందడుగు పడలేదు. కొన్ని మండలాల్లో ఇప్పటివరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడంతో ప్రజలు పాత మండల కేంద్రాల్లోని పీహెచ్‌సీలకు వెళ్లాల్సి వస్తోంది. ప్రభుత్వ కార్యాలయాలను ఇతర శాఖల భవనాల్లో నిర్వహిస్తున్నారు. కొన్ని మండలాల్లో ఆ వసతి కూడా లేకపోవడంతో అద్దె భవనాల్లో నిర్వహించాల్సి వస్తోంది. నిధుల్లేక అద్దె కూడా రెండు, మూడు నెలలకోసారి చెల్లిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment