రెవెన్యూ దక్కేనా..?
కొత్త మండలాలు వచ్చేనా..
ఇల్లెందు మండల పరిధిలో ఉన్న కొమరారం, టేకులపల్లి మండల పరిధిలోని బోడు, అశ్వాపురం మండల పరిధిలోని మొండికుంటలను కొత్త మండల కేంద్రాలుగా ప్రకటించాలని గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. ఈ మేరకు మండలాలను ఎలా విభజించాలనే అంశంపై ప్రాథమిక నివేదకలు సిద్ధ్దమయ్యాయి. అయితే ఈ వ్యవహారం కాగితాలను దాటి కార్యరూపం దిశగా ముందుకు సాగడం లేదు.
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలు ఏర్పాటు చేయాలనే డిమాండ్లపై చర్చిస్తామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. దీంతో జిల్లాలో పెండింగ్‌లో ఉన్న కొత్త రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ఆశలు చిగురిస్తున్నాయి.
మూడున్నరేళ్ల క్రితమే ప్రతిపాదనలు..
జిల్లాలో ఇల్లెందు, మణుగూరు కేంద్రాలుగా కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని మూడున్నరేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లినా నేటికీ పరిశీలన దశలోనే మగ్గుతున్నాయి. భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలో భద్రాచలం, పినపాక నియోజకవర్గాలు ఉన్నాయి. గోదావరికి ఇరువైపులా ఉన్న మండలాలు ప్రస్తుతం భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లో ఉన్నాయి. దీంతో నదికి ఎడమ వైపు ఉన్న ప్రాంతాన్ని భద్రాచలం రెవెన్యూ డివిజన్ పరిధిలోనే ఉంచి కుడి వైపు ఉన్న ప్రాంతాలను కలుపుతూ మణుగూరు కేంద్రంగా కొత్త రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. జనాభా ఎక్కువగా ఉన్న కొత్తగూడెం డివిజన్‌ను విభజించి ఇల్లెందుకు రెవెన్యూ డివిజన్ హోదా కల్పించాలని గతంలోనే అప్పటి ఎమ్మెల్యే హరిప్రియనాయక్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపైనే కమ్యూనిస్టు పార్టీలు సైతం పలుమార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి.
సులభంగా.. వేగంగా..
జిల్లాలో అటవీ ప్రాంతం ఎక్కువ కావడంతో పాటు పరిశ్రమలూ విస్తరించి ఉన్నాయి. సీతారామ వంటి బహుళార్థ సాధక సాగునీటి ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. వందల ఏళ్ల నుంచి సింగరేణి సంస్థ జిల్లాలో బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. ఇటీవల జాతీయ రహదారులు, కొత్త రైల్వేలైన్లు కూడా మంజూరయ్యాయి. దీంతో వివిధ అభివృద్ధి పనుల కోసం తరచూ భూసేకరణ చేయాల్సి వస్తుంది. కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటైతే పరిపాలన మరింత వేగంగా, సులభంగా అందించే వీలు కలుగుతుంది.
ఏజెన్సీలో వెసులుబాటు..
జనాభా తక్కువగా ఉండడం, సరిపడా ఎంపీటీసీ స్థానాలు లేకపోవడంతో కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు సాధ్యం కావడం లేదని అధికారులు అంటున్నారు. అయితే రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పోల్చితే విస్తీర్ణం పరంగా భద్రాద్రి జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. అడవులు, కొండ ప్రాంతాలు, గిరిజన జనాభా ఎక్కువ. ఏజెన్సీ ప్రాంతాల్లో జనాభా సంఖ్యతో సంబంధం లేకుండా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు ఏర్పాటు చేసే వెలుసుబాటు ఉంది. అప్పుడే పరిపాలన వెనుకబడిన ప్రాంతాలకు సులభంగా చేరువవుతుందనే వాదనలు ఉన్నాయి.
పొంగులేటి దృష్టి సారిస్తే..
గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూ డివిజన్లు, మండలాల విషయంలో హామీలే తప్ప ఆచరణకు నోచుకోలేదు. ప్రస్తుత రాష్ట్ర కేబినెట్‌లో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉమ్మడి జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారు. పినపాక, ఇల్లెందు ఎమ్మెల్యేలు పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య పొంగులేటి వెంటే తమ రాజకీయ ప్రయాణం సాగిస్తున్నారు. కనీసం ఇప్పుడైనా కొత్త మండలాలు, రెవెన్యూ డివిజన్ల అంశాన్ని వీరిద్దరూ పొంగులేటి దృష్టికి తీసుకెళ్లాలని ఈ ప్రాంత వాసులు కోరుతున్నారు.
మణుగూరు
ఇల్లెందు
మళ్లీ తెరపైకి కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు
అసెంబ్లీలో ప్రకటించిన మంత్రి పొంగులేటి
పెండింగ్‌లో మణుగూరు, ఇల్లెందు కేంద్రాలు
మూడు కొత్త మండలాలు కావాలంటున్న ప్రజాప్రతినిధులు
మూడున్నరేళ్ల క్రితమే ప్రభుత్వానికి ప్రతిపాదనలు
Comments
Please login to add a commentAdd a comment