కొండరెడ్లకు మౌలిక వసతులు
భద్రాచలం: కొండరెడ్లకు అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు ఐటీడీఏ పీఓ బి.రాహుల్ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో ఉద్యాన, వ్యవసాయ, విద్యుత్, అటవీ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పూసుకుంట గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్ల గిరిజనులకు మౌలిక వసతులు కల్పించాలని, ముఖ్యంగా విద్యుత్, రోడ్డు, వ్యవసాయానికి సంబంధించిన పనులు త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. పూసుగుప్పలో కొండరెడ్ల గిరిజనులకు అందుతున్న మౌలిక వసతులపైనా ఆరా తీశారు. గత వారం మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆ గ్రామంలో పర్యటించిన సందర్భంగా గిరిజనులు ఆయన దృష్టికి తెచ్చిన సమస్యలపై ప్రత్యేకంగా చర్చించారు. ఐటీడీఏ ద్వారా రైతులకు మోటార్లు అందిస్తామని, విద్యుత్ సరఫరాకు 70 శాతం సబ్సిడీ ఉందని, మిగిలిన 30 శాతం ఐటీడీఏ నుంచి చెల్లించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తామని తెలిపారు. బోరు, విద్యుత్ సౌకర్యం కల్పించగానే పామాయిల్ మొక్కలు వేయించాలని, అంతర పంటలుగా జొన్న, కొండజొన్న, బొబ్బర్లు సాగు చేసేలా చూడాలని అధికారులకు సూచించారు. మునగ చెట్లు, ఇతర పండ్ల చెట్లు కూడా వేయించాలన్నారు. సమావేశంలో ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్, విద్యుత్ శాఖ ఎస్‌ఈ మహేందర్ రెడ్డి, ఏడీ వెంకటరత్నం, జిల్లా ఉద్యానవన అధికారి కిషోర్, డీఏఓ బాబూరావు పాల్గొన్నారు.
విద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి
పాల్వంచ: విద్యార్థులకు అర్థమయ్యేలా పాఠ్యాంశాలు బోధించాలని పీఓ రాహుల్ ఉపాధ్యాయులకు సూచించారు. ఉద్దీపకం వర్క్‌బుక్‌లతో విద్యార్థుల్లో సామర్థ్యాలు పెంచాలన్నారు. మండలంలోని నాగారం తండా, తోగ్గూడెం జీపీఎస్ పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఉద్దీపకం పాఠ్యాంశాలను బోర్డుపై రాయించి విద్యార్థుల ప్రగతిని తెలుసుకున్నారు. మూడు నుంచి ఐదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, గణితం చదవడం, రాయడంలో వెనుకబడుతున్నందున వారికి అనుకూలంగా ఉండేలా ఈ పుస్తకాలను రూపొందించామని చెప్పారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, జీపీఎస్‌లలో విద్యార్థులను తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో దమ్మపేట ఏటీడీఓ చంద్రమోహన్, పీజీ హెచ్‌ఎం భద్రు, ఎస్సీఆర్‌పీ హరిలాల్, ఉపాధ్యాయులు సుజాత, పద్మ, రాంబాబు, పుల్లమ్మ పాల్గొన్నారు.
పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి..
భద్రాచలంఅర్బన్ : గిరిజన పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పీఓ రాహుల్ అన్నారు. బుధవారం ఆయన ఉమ్మడి జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల ప్రత్యేకాధికారులు, ఏటీడీఓలు, హెచ్‌ఎంలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గిరిజన విద్యార్థుల చదువు పటిష్టంగా ఉండాలంటే ఒకటి నుంచి ఐదు తరగతుల వారికి ఉద్దీపకం వర్క్‌బుక్‌లో సూచించినట్టుగా బోధన చేయాలని, వెనుకబడిన పిల్లలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. పదో తరగతి విద్యార్థులకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. నూతనంగా ప్రవేశపెట్టిన మెనూ అమలు చేయాలన్నారు. సమావేశంలో డీడీ మణెమ్మ, ఈఈ తానాజీ, ఏసీఎంఓ రమణయ్య, రాములు, ఏటీడీఓలు జహీరుద్దీన్, సత్యవతి, చంద్రమోహన్, జీసీడీఓ అలివేలు మంగతాయారు పాల్గొన్నారు.
ఐటీడీఏ పీఓ రాహుల్
Comments
Please login to add a commentAdd a comment