మేలు చేసేవే తినండి..
ఖమ్మంవన్‌టౌన్: చలిగాలుల నేపథ్యాన ఏం తింటే ఏమవుతుందోన్న ఆందోళన అందరినీ వెంటాడుతుంటుంది. ఇతర కారణాలతో అనారోగ్యం ఎదురైనా తీసుకునే ఆహారం ప్రభావమే కావొచ్చని భావిస్తుంటారు. ఈమేరకు చలి పెరుగుతున్న వేళ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏం తినొద్దనే అంశంపై ఖమ్మంకు చెందిన డాక్టర్ మీనా మురారి (బీడీఎస్, ఎంఐడీఏ – డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ న్యూట్రీషియన్) తెలిపిన వివరాలు... చలికాలంలో ఆకుకూరలు తినాలి. తద్వారా వాటిలోని యాంటీ ఆక్సీడెంట్లు, విటమిన్లు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పాలకూరలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది తినడం వలన హిమోగ్లోబిన్ పెరుగుతుంది. చలికాలంలో నెయ్యి తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. నెయ్యితో రోగనిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి సమస్యలు దరిచేరవు. అలాగే, డ్రై ప్రూట్స్, నట్స్ తీసుకుంటే అందులోని ప్రోటీన్లు, ఆమైనో యాసిడ్స్ వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. క్యారెట్, ఉల్లిపాయలు, బచ్చలికూర, పచ్చి బటానీలు, ఉసిరికాయలు తినాలి. ఇవి బీటాకెరోటిన్, విటమిన్ సీ వంటి పోషకాలు కలిగి ఉంటాయి. వీటితో పాటు పప్పులు, కూరగాయలు సూప్స్‌లా చేసుకుని తీసుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. పాలల్లో పసుపు, మిరియాలు, సొంటి మరిగించి ప్రతీరోజు తాగాలి. అలా చేసిన పాలను గోల్డెన్ మిల్క్ అంటారు. వయసు మీద పడినవారు టీ, కాఫీలకు బదులు హెర్బల్ టీ, అల్లం, తులసి ఆకులతో చేసిన టీ తాగితే మంచిది. వేరుశనగలు ఉడకబెట్టి కానీ, వేయించుకుని తింటే మంచిది. అందులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. జామకాయలో ఉండే సీ విటమిన్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. ఇకపోతే స్వీట్లు, ఐస్‌క్రీమ్‌లకు దూరంగా ఉండాలి. ఎప్పటికప్పుడు వేడివేడి ఆహారం తినడం మరింత మంచిది.
Comments
Please login to add a commentAdd a comment