రామయ్యకు స్నపన తిరుమంజనం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి బుధవారం స్నపన తిరుమంజనం జరిపించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామి వారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
4,264 గ్రామీణ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు
చుంచుపల్లి: గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలోని 479 గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల తుది జాబితా ప్రచురించినట్లు జిల్లా పంచాయతీ అధికారి కె.చంద్రమౌళి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం వార్డుల సంఖ్య 4,232 కాగా గ్రామీణ ప్రాంతాల్లో 4,264 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. గ్రామీణ ఓటర్లు 6,33,947 మంది ఉండగా పురుషులు 3,08,492, మహిళలు 3,25,431, ఇతరులు 24 మంది ఉన్నారని వివరించారు. 200 మంది ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలు 3,528, 201–400 ఓటర్లు ఉన్న పోలింగ్ స్టేషన్లు 595, 401–650 ఓటర్లు వరకు ఉన్న కేంద్రాలు 141 చొప్పున ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
వేగంగా ఇంటింటి సర్వే
ఇల్లెందురూరల్: ఇందిరమ్మ ఇళ్ల సర్వే వేగవంతం చేశామని డీపీఓ చంద్రమౌళి తెలిపారు. ఇల్లెందులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ప్రజాపాలన సభల సందర్భంగా 2,73,493 మంది ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారని, వారి ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నామని చెప్పారు. ఇప్పటివరకు 33 వేల దరఖాస్తులను సర్వే చేశామన్నారు. కొన్ని గ్రామాల్లో సిగ్నల్ సమస్యతో జాప్యం జరుగుతోందని, అక్కడ ఆఫ్‌లైన్‌లో సర్వే చేసేలా ప్రత్యామ్నాయ యాప్ సిద్ధం చేశామని తెలిపారు. గ్రామపంచాయతీ కార్మికుల వేతనాలు నేరుగా ప్రభుత్వమే చెల్లించేలా ప్రణాళిక రూపొందించిందని, జిల్లాలోని కార్మికుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేశామని అన్నారు. జీఓ.51 ప్రకారం 500 జనాభాకు ఒక కార్మికుడు చొప్పున మాత్రమే ప్రభుత్వం వేతనాలు చెల్లిస్తుందని, అదనంగా నియమించిన వారికి పంచాయతీలే డైలీ లేబర్ పేరిట వేతనాలు చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఎంపీడీవో ధన్‌సింగ్, డీఎల్‌పీవో రమణ, ఎంపీవో చిరంజీవి పాల్గొన్నారు.
మళ్లీ వచ్చిన పెద్దపులి !
ధ్రువీకరించిన ఫారెస్ట్ డివిజన్ అధికారి
కరకగూడెం: మండలంలోని రఘునాథపాలెం గ్రామ అటవీ ప్రాంతంలో వారం రోజుల క్రితం పెద్దపులి అడుగు జాడలను అటవీ శాఖ అధికారులు గుర్తించారు. రెండు రోజుల క్రితం ములుగు జిల్లా తాడ్వాయి మండలం నర్సాపురం, పంబాపురం అటవీ ప్రాంతాల్లోకి వెళ్లినట్లు వెల్లడించారు. కాగా, బుధవారం రఘునాథపాలెం గ్రామానికి చెందిన కొమరం నర్సయ్య అనే రైతు మేకలను మేపేందుకు గ్రామ సమీపంలోని అడవికి వెళ్లగా.. పాలఒర్రె వద్ద మేకతో పాటు వెంట తీసుకెళ్లిన కుక్కలు కూడా బెదురుతూ పరుగుతీశాయి. ఈలోగా పులి గాండ్రిపు వినిపించడంతో నర్సయ్య గ్రామానికి పరుగెత్తుకుంటూ వచ్చి స్థానికులతో పాటు అటవీ అధికారులకు తెలిపాడు. దీంతో అటవీ అధికారులు చేరుకుని.. అడవిలోకి ఎవరూ వెళ్లొద్దంటూ డప్పు చాటింపు వేయించారు. ఈ విషయమై ‘సాక్షి’ మణుగూరు ఎఫ్‌డీఓ మక్సుద్ మొహినొద్దీన్‌ను వివరణ కోరగా పెద్దపులి వచ్చిన విషయం వాస్తవమేనని ధ్రువీకరించారు.
64 మందికి కంటి శస్త్ర చికిత్సలు
మణుగూరు టౌన్: సింగరేణి ఆధ్వర్యంలో బుధవారం 64 మందికి కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి కళ్లజోళ్లు అందించారు. ఈ సందర్భంగా జీఎం దుర్గం రాంచందర్ మాట్లాడుతూ.. పరిసర గ్రామాల్లో నిర్వహిస్తున్న ఉచిత వైద్యశిబిరాల ద్వారా రామానుజవరం, తిర్లాపురం, బెస్తగూడెం గ్రామాల్లో 130 మందికి కంటి శస్త్ర చికిత్సలు అవసరమని గుర్తించినట్లు తెలిపారు. వారిలో మొదటి విడతలో 64 మందిని సికింద్రాబాద్ ఆస్పత్రికి తరలించా మని, ఆపరేషన్లు చేయించి రూ.1.25 లక్షల విలువైన కళ్లజోళ్లు అందించామని తెలిపారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు దుర్గం సుమతి, పీఓ శ్రీనివాసాచారి, డీవైసీఎంఓ మేరికుమారి, టి.సురేశ్, శేషగిరి, అవినాష్, సింగు శ్రీనివాస్, షాకిరా పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment