చలితో జాగ్రత్త..
చిన్నాపెద్దలు అంతా భద్రం..
● రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● కుర్నవల్లిలో 9 డిగ్రీల కనిష్ట స్థాయిలో నమోదు
● అప్రమత్తంగా లేకుంటే
అనారోగ్యం కొనితెచ్చుకున్నట్లే..
భద్రాచలం అర్బన్: రోజురోజుకూ ఉష్ణోగ్రతలు కనిష్టస్థాయికి చేరుతూ చలి విజృంభిస్తోంది. ఉదయం, సాయంత్రం ఇదే పరిస్థితి ఉండగా మధ్యాహ్నం సైతం చలిగాలులు వీస్తుండడంతో పిల్లలు, పెద్దవారు ఆస్తమా(ఉబ్బసం), అలెర్జిక్ రైనైటిస్, సైనసైటిస్ వంటి శ్వాసకోశ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. కొందరిలో ఇది ప్రాణాంతకం కాకపోయినా తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తుంది. ఈ మేరకు వ్యాధుల లక్షణాలు, జాగ్రత్తలపై భద్రాచలం ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ముదిగొండ రామకృష్ణ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. చలికాలంలో ఊపిరి ఆడకపోవడం, పిల్లికూతలు, ఛాతి పట్టేయడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అలాగే, దగ్గు, కఫం, జలుబు, ముక్కుకారడం, కళ్లమంటలు, ముక్కులు పట్టేయడం, గొంతునొప్పి, జ్వరం, ఒళ్లునొప్పులు, కండరాల నొప్పులు వంటి లక్షణాలతో బాధపడుతుంటారు. వీటి బారిన పడకుండా చల్లగాలికి బయటకు వెళ్లకపోవడమే ఉత్తమం. తప్పనిసరి వెళ్లాల్సి వస్తే ముఖానికి చలిగాలి తగలకుండా వస్త్రాలు కట్టుకోవడమో లేదా మాస్క్ ధరించడంతో పాటు చెవుల్లో దూది పెట్టుకోవాలి. గుండె జబ్బులు ఉన్నవారు, గుండె ఆపరేషన్ చేయించుకున్న వారు చలిలో వాకింగ్ చేయొద్దు. బీపీ, షుగర్ ఉన్నవారు కూడా జాగ్రత్తలు పాటించాలి. ఎప్పుడూ గోరువెచ్చని నీటినే తాగాలి. తీసుకునే ఆహారం వేడిగా ఉండాలి. చల్లటి పానీయాలు, కూల్‌డ్రింక్స్, ఐస్‌క్రీమ్స్ వంటి వాటికి జోలికెళ్లొద్దు. జలుబు చేసిన వారు వేడినీటిలో చిటికెడు ఉప్పు వేసి రోజుకు రెండు మూడుసార్లు పుక్కిలించాలి. సహజంగా దొరికే పసుపు వేడినీటిలో వేసి ఆవిరిపట్టడం వంటివి చేసినా ఫలితం ఉంటుంది. మిరియాలు, ఎండు అల్లంతో చేసిన ద్రావణాన్ని రోజులో ఒకసారైనా తాగాలి. రెండు లేదా మూడురోజులపాటు ఎవరైనా ఆయాసం, దగ్గు, కఫంతో బాధపడుతున్నట్లయితే వెంటనే సమీపంలోని శ్వాసకోశ సంబంధిత నిపుణులను సంప్రదించి వైద్యం పొందాలి.
Comments
Please login to add a commentAdd a comment