ఎరుపెక్కిన ఇల్లెందు
● నేడు, రేపు సీపీఎం జిల్లా మహాసభలు ● ఏర్పాట్లు పూర్తి చేశామని జిల్లా కార్యదర్శి వెల్లడి
ఇల్లెందు/సింగరేణి(కొత్తగూడెం): సీపీఎం జిల్లా మహాసభలకు ఇల్లెందు ముస్తాబైంది. బ్యానర్లు, తోరణాలు, ప్లెక్సీలతో పట్టణం ఎరుపుమయంగా మారింది. ఇల్లెందులోని 24 ఏరియా కమ్యూనిటీ హాల్‌లో శుక్ర, శనివారాల్లో మహాసభలు జరుగనున్నాయి. శుక్రవారం ఉదయం భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, సుమారు 500 మంది ప్రతినిధులు హాజరవుతారని పార్టీ జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య తెలిపారు. గురువారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. మహాసభలకు ముఖ్య అతిథులుగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, నాయకులు ఎస్.వీరయ్య, బి.వెంకట్, మిడియం బాబూరావు, ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి తదితరులు హాజరవుతారని వివరించారు. జిల్లాలో గత మూడేళ్లలో ప్రజా సమస్యలపై నిర్వహించిన పోరాటాలు, సాధించిన విజయాలను సమీక్షించుకుని భవిష్యత్ పోరాటాలకు రూపకల్పన చేస్తామని చెప్పారు. సీతారామ ప్రాజెక్ట్ ద్వారా జిల్లాలోని భూములకు నీరందించేలా మంత్రులు ఆలోచించడం లేదని, దీంతో జిల్లాకు అన్యాయం జరుగుతుందని అన్నారు. పాలకులు అనుసరిస్తున్న విధానాలతో సింగరేణి, కేటీపీఎస్, బీటీపీఎస్ వంటి ప్రభుత్వ రంగ సంస్థల్లో నానాటికీ ఉద్యోగుల సంఖ్య తగ్గుతోందని ఆరోపించారు. పార్టీ నాయకులు పి.సోమయ్య, మచ్చా వెంకటేశ్వర్లు, ఏజే రమేష్, లిక్కి బాలరాజు, కె.బ్రహ్మచారి, అన్నవరపు సత్యనారాయణ, ఆలేటి కిరణ్, వజ్జా సురేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment