రాష్ట్రస్థాయిలో పతకాలు సాధించాలి
గురుకులాల స్పోర్ట్స్ మీట్
ప్రారంభోత్సవంలో కలెక్టర్ పాటిల్
పాల్వంచరూరల్: గురుకుల విద్యార్థులు రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ చూపి అధిక పతకాలు సాధించాలని, జాతీయ స్థాయిలోనూ రాణించి రాష్ట్రానికి పేరు తేవాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆకాంక్షించారు. పాల్వంచ మండలం లక్ష్మీదేవిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో జరుగుతున్న రాష్ట్రస్థాయి స్పోర్ట్స్ మీట్‌ను గురుకులాల జాయింట్ సెక్రటరీ బి.సక్రునాయక్‌తో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విద్యార్థులు పరస్పరం గౌరవించుకుంటూ క్రమశిక్షణతో కూడిన క్రీడాస్ఫూర్తిని చాటాలన్నారు. విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీయడంలో ఉపాధ్యాయులు, పీఈటీలు, పీడీలు చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చాటాలని, క్రీడలతో శారీరక, మానసిక ఆరోగ్యం చేకూరుతుందని చెప్పారు. గురుకులాల జాయింట్ సెక్రటరీ సక్రునాయక్ మాట్లాడుతూ.. సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో చదువుతో పాటు క్రీడలకూ సమ ప్రాధాన్యత కల్పిస్తున్నామని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో క్రీడా నిపుణులతో విద్యార్థులకు శిక్షణ ఇప్పించి, వారిలోని నైపుణ్యాన్ని వెలికితీస్తామని చెప్పారు. ప్రతీ ఏడాది పాఠశాల స్థాయితో పాటు జోనల్, రాష్ట్ర స్థాయిల్లో పోటీలు నిర్వహిస్తూ విజేతలను సొసైటీ లీగ్ పోటీలకు పంపిస్తామని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వివేక్, ఎంపీడీఓ బి.నారాయణ, మల్టీ జోనల్ అధికారి కాంపాటి అలివేలు, జిల్లా జోనల్ అధికారులు స్వరూప, ప్రత్యూష, ప్రిన్సిపాల్ పాపారావు, సీనియర్ ప్రిన్సిపాల్ కన్నెకంటి వెంకటేశ్వర్లు, ఖమ్మం డీసీఓ రాజ్యలక్ష్మి, రాష్ట్ర స్పోర్ట్స్ మీట్ ఓవరాల్ ఇన్‌చార్జ్ సట్ల శంకర్‌తో పాటు రాజు, నాగేశ్వరరావు, ఎం.స్వరూప, విజయదుర్గ, జ్యోతి, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.
1,358 మంది విద్యార్థులు హాజరు..
మూడు రోజులపాటు జరగనున్న ఈ క్రీడా పోటీలకు రాష్ట్రంలోని కాళేశ్వరం, బాసర, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ జోన్లకు చెందిన 1,358 మంది విద్యార్థులు హాజరయ్యారు. అండర్ 14, 17, 19 విభాగాల్లో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, టెన్నికాయిట్, చదరంగం, క్యారమ్స్‌తో పాటు 100, 200, 400, 800, 1500 మీటర్ల పరుగుపందెం, లాంగ్‌జంప్, హైజంప్, డిస్కస్‌త్రో, 400 మీటర్ల రిలే పరగు పందెం పోటీలు నిర్వహిస్తున్నారు. మొదట జోన్ల వారీగా విద్యార్థులు మార్చ్‌ఫాస్ట్ నిర్వహించారు. అనంతరం ప్రదర్శించిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment