సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కలెక్టరేట్‌లో గురువారం రోడ్డు భద్రతపై జిల్లా స్థాయి అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా, వైకల్యం బారిన పడకుండా భద్రతా చర్యలు చేపట్టాలని కోరారు. ప్రమాదాల నివారణపై పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ రహదారి పక్కనున్న గ్రామాల్లో పోలీస్ కళాబృందాలతో ప్రచారం చేపట్టాలన్నారు. జిల్లాలో ప్రమాదాల బ్లాక్ స్పాట్‌లను గుర్తించామని, ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని అన్నారు. ద్విచక్ర వాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలన్నారు. ట్రాఫిక్ కానిస్టేబుళ్లకు మైకులు, కూలింగ్ హెల్మెట్ల కోసం ప్రతిపాదనలు అందజేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో ఆర్‌అండ్‌బీ, పీఆర్, ఎన్‌హెచ్ ఈఈలు వెంకటేశ్వర్లు, కాశయ్య, యుగంధర్, డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డీఈఓ వెంకటేశ్వరాచారి, రవాణాధికారి సదానందం, డీసీహెచ్‌ఎస్ రవిబాబు, ట్రాఫిక్ ఎస్‌ఐ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment