మట్టి కట్టలు చోరీ?
●నర్సరీలు, పొలాలలకు విక్రయం
●రూ.కోట్లతో దందా
అశ్వారావుపేట: అశ్వారావుపేట పరిసర ప్రాంత మట్టి, నీరు, గాలి నాణ్యమైనవని వ్యవసాయ, ఉధ్యాన అనుబంధ సంస్థలు, అన్ని రకాల పంటలకు ఈప్రాంతం ప్రసిద్ధి. అందుకే దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో మామిడి, ఇతర ఉధ్యాన మొక్కల నర్సరీలు వందల సంఖ్యలో ఉన్నాయి. అంతా అక్రమ వ్యాపారమే అయినా నర్సరీలను నియంత్రించే వారే లేరు. చివరకు సీతారామ పంప్‌హౌస్, కాల్వల మట్టిని కూడా చోరీ చేసేలా ఎగబడుతున్నారు. నర్సరీలకు అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా మట్టిని రవాణా చేస్తే ఒక్కో ట్రిప్‌కు రూ.800 వరకు చెల్లించాల్సి ఉండేది. అదే సీతారామ ప్రాజెక్టు కాల్వల కట్టల నాణ్యమైన ఎర్రమట్టి అయితే టిప్పర్‌లలో ఎవరికీ అనుమానం రాకుండా రవాణా చేసుకోవచ్చు. నర్సరీలకు ఈమట్టి అవసరం కావడంతోపాటు టిప్పర్ ఆపరేటర్లు వ్యాపారం షురూ చేశారు. దాదాపు ఏడాది కాలంగా గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న ఈ తంతు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక్కో టిప్పర్‌కు రూ.10 వేలు పైనే చెల్లించి నర్సరీ వ్యాపారులు మట్టిని కొనుగోలు చేసినట్లు సమాచారం.
సత్తుపల్లి, పాల్వంచకు కూడా..
నాణ్యమైన ఎర్రమట్టిని దమ్మపేట, అశ్వారావుపేట మండలాల నర్సరీలకు అక్రమంగా రవాణా చేయగా.. చౌడు, ఇసుక పొర, రాతి పొరల నేలల మట్టిని సత్తుపల్లి, పాల్వంచ వంటి పట్టణాలకు గృహనిర్మాణాల నిమిత్తం తరలించినట్లు సమాచారం. అంతే కాకుండా ఇటీవల జరిగిన రహదారుల నిర్మాణాల్లో బర్మ్‌ఫిల్లింగ్ కోసం కూడా ఇదే మట్టిని వినియోగించినట్లు తెలుస్తోంది. టిప్పర్ ఆపరేటర్లు కొందరు బ్రోకర్లను ఆశ్రయించి బుకింగ్ చేసుకుని రాత్రి వేళల్లో అక్రమంగా రవాణా చేస్తున్నట్లు తెలియవస్తోంది. దారి పొడవునా ముడుపులు చెల్లిస్తూ ఏశాఖ సిబ్బందితో ఇబ్బంది లేకుండా మట్టి అక్రమ రవాణాను కొనసాగిస్తున్నారు. దమ్మపేట మండలం గండుగులపల్లి పంప్ హౌస్ మట్టి కట్టలను తొలిచి మరీ మట్టి రవాణా చేస్తున్నారు. కాగా పంప్‌హౌస్‌ల వద్ద లష్కర్‌లు, కాపలాదారులు ఉన్నా.. మట్టి ఎలా బయటకు వస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయాన్ని ఇరిగేషన్ డీఈఈ కృష్ణ దృష్టికి తీసుకువెళ్లగా చలానా చెల్లించిన వారికి మట్టి తవ్వుకునే అవకాశం కల్పిస్తామని, అదీ చాలా తక్కువ మొత్తంలోనే అవకాశం ఉందని, విచారణ నిర్వహిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment