అడవి వాలుగ పట్టివేత
దుమ్ముగూడెం: మండలంలోని దుమ్ముగూడెం క్రాస్ రోడ్ వద్ద అక్రమంగా తరలిస్తున్న అడవి వాలుగను ఎఫ్‌డీఓ సుజాత, ఎఫ్‌ఆర్‌ఓ కమల పట్టుకున్నారు. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం నుంచి అడవి వాలుగను తీసుకొచ్చి గౌరవరంలో కొన్ని రోజులు ఉంచి అనంతరం ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలో ఆదివారం రాత్రి దుమ్ముగూడెం క్రాస్ రోడ్డు వద్ద అటవీ అధికారులు కనిపించారు. దీంతో నిందితులు వాలుగను అక్కడే వదిలేసి పారిపోయారు. అటవీ అధికారులు వాలుగను స్వాధీనం చేసుకుని భద్రాచలం రేంజ్ కార్యాలయానికి తరలించారు.
పేకాట శిబిరంపై దాడి
దమ్మపేట: మండలంలోని బూరుగుగుంపు శివారులోని అటవీ క్షేత్రంలో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై సోమవారం స్థానిక, టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా మరో ఆరుగురు పరారయ్యారు. వారి వద్ద నుంచి రూ.73,000 నగదు, ఆరు సెల్‌ఫోన్లు, ఎనిమిది ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నామని ఎస్‌ఐ సాయికిశోర్‌రెడ్డి తెలిపారు.
ఇన్ ఫార్మర్ నెపంతో యువకుడి హ త్య
చర్ల: ఇన్‌ఫార్మర్ నెపంతో మావోయిస్టులు ఓ యువకుడిని హతమార్చిన ఘటన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది. బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్‌స్టేషన్ పరిధిలోని కమ్కానార్ గ్రామానికి చెందిన ముఖేష్ హేమ్లా (28) శనివారం గంగులూరుకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో అడ్డంగించిన మావోయిస్టులు అతడిని కిడ్నాప్ చేశారు. రెండు రోజుల తర్వాత హతమార్చి మృతదేహాన్ని సోమవారం ఉదయం కమ్కానార్ గ్రామ శివారులో పడవేశారు. పోలీస్ ఇన్‌ఫార్మర్‌గా వ్యవహ రిస్తుండడం వల్లే హతమార్చామని పేర్కొంటూ మావోయిస్టు పార్టీ గంగులూరు ఏరియా కమిటీ ఏరిట మృతదేహం వద్ద లేఖ వదిలారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
అశ్వాపురం: మండలంలోని మొండికుంట సమీపంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఏపీ రాష్ట్రం అల్లూరి జిల్లా ఎటపాక మండలం తునికిచెరువు గ్రామానికి చెందిన ఊకె సంతోష్ (20) రెండేళ్లుగా అశ్వాపురం మండలం వెంకటాపురంలో పెద్దనాన్న ఇంట్లో ఉంటున్నాడు. ఆదివారం రాత్రి బైక్‌పై సంతోష్ మణుగూరు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మొండికుంట వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. సీఐ అశోక్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారించారు. కేసు నమోదు చేశామని ఎస్‌ఐ తిరుపతిరావు తెలిపారు.
లారీ ఢీకొని వృద్ధురాలు...
మణుగూరుటౌన్: మండలంలోని రాజీవ్‌గాంధీనగర్‌కి చెందిన కొట్టె పిచ్చమ్మ (65) ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న క్రమంలో లారీ ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలిని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment