సోలార్ ప్లాంట్ వద్ద రోడ్డుప్రమాదం
ఇల్లెందు/కారేపల్లి : ఇల్లెందు – కారేపల్లి మండలాల సరిహద్దులో సోలార్ ప్లాంట్ వద్ద మూలమలుపులో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఇంకో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇల్లెందు మండలం మాణిక్యారం పంచాయతీ పరిధి ఎల్లాపురానికి చెందిన లక్ష్మణ్, చింటు ఓ బైక్‌పై ఖమ్మం వైపు వెళ్తున్నారు. అదే సమయాన ఇల్లెందు వైపునకు మరో బైక్‌పై ఉసిరికాయలపల్లికి చెందిన ఎల్లావుల మల్లయ్య (40), మారుతి వెంకటేశ్వర్లు ఎదురుగా వచ్చారు. ఈ రెండు వాహనాలు సోలార్ ప్లాంట్ వద్ద ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో తీవ్రంగా గాయపడిన మల్లయ్య అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే, వెంకటేశ్వర్లు సైతం తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లగా ఇల్లెందు ఆస్పత్రికి, అక్కడి నుంచి ఖమ్మం తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందాడు. మృతుల్లో మల్లయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్‌ఐ రాజారాం ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.
ఇందిరమ్మ సర్వే కోసం వచ్చి..
హైదరాబాద్‌లో ఉంటున్న ఉసిరికాయలపల్లి వాసి మారుతి వెంకటేశ్వర్లు ఇందిరమ్మ సర్వే జరుగుతుండటంతో తన వివరాలు సమర్పించేందుకు గ్రామానికి వచ్చారు. సర్వే ముగిశాక మిత్రుడైన మల్లయ్యతో కలిసి ఇల్లెందు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనలో ఇద్దరు మృతి చెందటంతో కుటుంబాల్లో విషాదం నెలకొంది. కాగా, మల్లయ్య మృతదేహంతో పాటు అపస్మారక స్థితికి చేరిన వెంకటేశ్వర్లును ఇల్లెందు ఆస్పత్రికి తీసుకురాగా కుటుంబీకుల రోదనలతో మార్మోగింది. అనంతరం వెంకటేశ్వర్లును ఖమ్మం తరలించగా ఆయన సైతం మృతి చెందడంతో వారు కన్నీరుమున్నీరుగా రోదించారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరికి చికిత్స చేస్తున్నారు.
సోలార్ ప్లాంట్ వద్ద తరచూ ప్రమాదాలు
ఇల్లెందు – కారేపల్లి మండలాల సరిహద్దులో ఏర్పాటుచేసిన సోలార్‌ప్లాంట్ వద్ద తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. మూడు నెలల కిందట ఇక్కడే జరిగిన ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. సోలార్ ప్లాంట్ సమీపాన బైపాస్‌లో అనేక మలుపులు ఉన్నాయి. దీంతో కొత్తగా వచ్చే వారే కాక గ్రామస్తులు సైతం ప్రమాదాల బారిన పడుతున్నారు. సింగరేణి, ఆర్ అండ్‌బీ అధికారులు స్పందించి హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలనే వినతులు వెల్లువెత్తుతున్నాయి.
రెండు బైక్‌లు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతి
Comments
Please login to add a commentAdd a comment