ప్రియుడి ఇంటి ముందు యువతి బైఠాయింపు
కొణిజర్ల: ప్రేమ పేరుతో తనతో సహజీవనం చేసి ఇప్పుడు ముఖం చాటేశాడని ఆరోపిస్తూ ఓ యువతి ప్రియుడి ఇంటి ఎదుట బైఠాయించిన ఘటన మండలంలోని సింగరాయపాలెంలో చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువతికి కొణిజర్ల మండలం సింగరాయపాలెంకు చెందిన సుధీర్‌తో హైదరాబాద్‌లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో కొన్నాళ్లుగా వారు సహజీవనం చేస్తున్నారు. ఇంతలోనే సుధీర్ ఉద్యోగరీత్యా అమెరికా వెళ్లొచ్చాక సదరు యువతిని దూరం పెట్టినట్లు తెలిపింది. ఫోన్ చేస్తే స్పందించకపోవడంతో ఆమె సింగరాయపాలెం చేరకుని యువకుడి ఇంటి ఎదుట బైఠాయించింది. దీంతో యువకుడి కుటుంబీకులు తాళం వేసి వెళ్లిపోగా ఆమె అక్కడే కూర్చుని తనకు న్యాయం చేయాలంటూ స్థానిక పెద్దలను కోరుతోంది. ఈవిషయమై ఎస్‌ఐ సూరజ్‌ను వివరణ కోరగా ఇరుపక్షాల నుంచి ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.
లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిపై కేసు
తిరుమలాయపాలెం: మండలంలోని గోల్‌తండా గ్రామపంచాయతీ పరిధి జింకలగూడెంలో వివాహితపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదైంది. సదరు వివాహిత పంట చేను నుంచి ఇంటికి వస్తుండగా అదే గ్రామానికి చెందిన మహ్మద్ సైదా వేధింపులకు పాల్పడ్డాడు. దీంతో ఆమె ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
ఖమ్మంరూరల్: మండలంలోని పోలిశెట్టిగూడెంకు చెందిన కౌలు రైతు ఉండేటి రమేష్(45) అప్పుల బాధ తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కూలీ పనులకు వెళ్తూనే రమేష్ రెండేళ్లుగా గ్రామంలో రెండెకరాల భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన మిర్చి సాగు చేయగా పంట పెట్టుబడికి చేసిన అప్పులు పెరగడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. దీంతో అప్పులు తీర్చే మార్గం కానరాక మనోవేదనతో ఈనెల 26న ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగగా కుటుంబీకులు ఖమ్మం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతున్న రమేష్ శుక్రవారం మృతి చెందాడు. ఆయనకు భార్య పద్మ, ఇద్దరు పిల్లలు ఉండగా కేసు నమోదు చేసినట్లు సీఐ ముష్క రాజు తెలిపారు.
అదుపుతప్పి బొగ్గు టిప్పర్ బోల్తా
టేకులపల్లి: అదుపుతప్పి బొగ్గు టిప్పర్ బోల్తా పడిన ఘటన మండల కేంద్రంలో చోటుచేసుకుంది. శుక్రవారం తడికలపూడి యార్డు నుంచి 14 టైర్ల టిప్పర్ బొగ్గులోడ్ చేసుకుని టేకులపల్లి వైపునకు బయలుదేరింది. ఇదే సమయంలో ఖాళీ టిప్పర్ బొగ్గు కోసం యార్డుకు బయలుదేరింది. తడికలపూడి రోడ్డులో ఫారెస్టు కార్యాల యం సమీపంలో కల్వర్టు వద్ద ఎదురుగా వస్తు న్న ఖాళీ టిప్పర్‌ని తప్పించబోయి బొగ్గులోడ్ టిప్పర్ కల్వర్టులోకి బోల్తా పడింది. దీంతో సుమారు 35టన్నుల బొగ్గు నేలపాలైంది. డ్రైవర్ మూడు రవి ప్రాణాలతో బయటపడ్డాడు.
Comments
Please login to add a commentAdd a comment