వీసీకి హాజరైన కలెక్టర్
సూపర్‌బజార్(కొత్తగూడెం): రాష్ట్రంలో మహిళా సాధికారతే లక్ష్యంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ క్యాంపు కార్యాలయం నుంచి వీసీకి హాజరయ్యారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్‌ప్లాంట్‌లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుదుత్పత్తికి ఇప్పటికే ఇంధనశాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖలకు ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిని బుధవారం మంత్రులు సీతక్క, కొండ సురేఖలతో కలిసి ఉప ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందించాలి
● జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి
చండ్రుగొండ : ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందేలా అధి కారులు పనిచేయాలని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణ అధికారి నాగలక్ష్మి సూచించారు. బుధవారం ఆమె ఎంపీడీఓ కార్యాలయాన్ని సందర్శించారు. మండలస్థాయి అధికారులు సమన్వయంతో పనిచేసి ప్రజలకు మేలు జరిగేలా చూడాలన్నారు. కార్యాలయ రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ డిప్యూటీ సీఈఓ చంద్రశేఖర్, ఎంపీడీఓ బయ్యారపు అశోక్ పాల్గొన్నారు.
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారమే లక్ష్యం
కొత్తగూడెంఅర్బన్: తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ, ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరి ష్కారం, అభ్యున్నతే లక్ష్యమని పీఆర్‌టీయూ ఎమ్మెల్సీ అభ్యర్థి పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. బుధవారం కొత్తగూడెంలోని సంఘం కార్యాలయంలో నిర్వహించిన మండల అధ్యక్షకార్యదర్శుల సమావేశంలో మాట్లాడారు. తనను ఎమ్మెల్సీగా గెలిపిస్తే ఏ రాజకీయ పార్టీకీ వత్తాసు పలకకుండా, కేవలం సమస్యల పరిష్కారానికే కృషి చేస్తానని తెలిపారు. ఈ సమావేశంలో పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవి, నాయకులు జహంగీర్ షరీఫ్, నర్సయ్య, రవీందర్, ఆరిఫ్, శ్రీనివాసరావు, సంగమేశ్వర్‌రావు, మండల అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉపాధ్యాయులు
నిబద్ధతతో పనిచేయాలి
● ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
చర్ల: ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేయాలని, విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు కృషి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి సూచించారు. బుధవారం మండలంలోని ఏహెచ్‌ఎస్ ఉంజుపల్లి, ప్రభుత్వ జూని యర్ కళాశాల, తేగడలోని జిల్లా పరిషత్ హైస్కూళ్లను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యను బలోపేతం చేసేందుకు ఉపాధాయులంతా కృషి చేయాలన్నారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి డిప్యూటేషన్‌ను అనుమతించవద్దని కోరారు.
జాతీయస్థాయి
పోటీలకు ఎంపిక
పాల్వంచరూరల్: మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న సాంఘిక సంక్షేమ బాలుర కళాశాల ఇంటర్ విద్యార్థి వి.నాగవర్షిత్ జాతీయస్థాయి చిత్రలేఖనం పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 6న హైదరాబాద్‌లోని బోట్ క్లబ్‌లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలో ప్రతిభ చూపి ప్రథమస్థానంలో నిలిచాడు. ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు ఢిల్లీలో జరగనున్న జాతీయస్థాయి యూత్ ఫెస్ట్‌వల్‌కు ఎంపికయ్యాడు. విద్యార్థితోపాటు ఆర్ట్ ఉపాధ్యాయుడు సుభాష్‌ను ప్రధానాచార్యుడు అనిల్‌కుమార్, ఉపప్రధానాచార్యుడు అన్వేశ్, అధ్యాపకులు ఎన్. నాగేశ్వరరావు, ఆర్.కృష్ణ, సరోజ బుధవారం అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment