ఇదేం పద్ధతి ‘గురూ..!’
● రూ.2 వేలు లంచం తీసుకుంటూ చిక్కిన గురుకులం ప్రిన్సిపాల్ ● ఆయనతో పాటు అటెండర్ కూడా..
ఇల్లెందు: వేతన బకాయి ఇప్పించాలని కోరిన గెస్ట్ టీచర్ నుంచి రూ.2 వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడో ఓ మైనారిటీ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్. ఈ పాపంలో అటెండర్‌ను కూడా భాగస్వామిని చేశాడు. వివరాలిలా.. ఇల్లెందులోని మైనారిటీ గురుకుల(బాలుర) కళాశాలలో సంధ్యారాణి గెస్ట్ టీచర్‌గా పని చేస్తున్నారు. కొన్ని నెలలుగా పెండింగ్ ఉన్న జీతం ఇప్పించాలని ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణను కోరారు. అయితే తనకు రూ.2వేలు లంచం ఇవ్వాలని, లేకుంటే వేతనం నిలిపివేయిస్తానని ఆయన బెదిరించాడు. ప్రిన్సిపాల్ వేధింపులు తట్టుకోలేని సంధ్యారాణి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. దీంతో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ ఆధ్వర్యంలో అధికారులు రంగంలోకి దిగారు.
నిర్ణీత సమయాని కంటే ముందే రావాలని..
రూ.2 వేలు ఇస్తానని సంధ్యారాణి ప్రిన్సిపాల్‌ను కలవగా.. గురువారం రోజున నిర్ణీత సమయానికి ముందే పాఠశాలకు రావాలని, తాను కూడా వస్తానని ప్రిన్సిపాల్ కృష్ణ చెప్పాడు. దీంతో సంధ్యారాణి ప్రార్థన సమయానికి ముందే పాఠశాలకు చేరుకున్నారు. అప్పటికే కృష్ణ వచ్చి తన సీటులో కూర్చోగా టీచర్ వెళ్లి రూ.2 వేలు ఇవ్వబోయారు. అయితే సీసీ కెమెరాలు ఉన్నందున తాను నేరుగా తీసుకోనని, అటెండర్ చిచ్చెల్ల రామకృష్ణకు ఇవ్వాలని సూచించాడు. దీంతో సంధ్యారాణి బయటకు వచ్చి రామకృష్ణకు నగదు ముట్టజెప్పగా అతడు వెళ్లి ప్రిన్సిపాల్‌కు అందించాడు. ఈ క్రమాన ముందస్తు పథకం ప్రకారం అక్కడికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.
అందరూ బాధితులే..!
మైనారిటీ గురుకుల పాఠశాలలో నిత్యం విజిలెన్స్ తనిఖీలు ఉంటాయి. అయినా ప్రిన్సిపాల్ మాత్రం ఉద్యోగులందరినీ వేధిస్తుంటాడని చెప్పుకుంటున్నారు. చివరకు ఆయన వేధింపుల తట్టుకోలేక సంధ్యారాణి ఏసీబీని ఆశ్రయించారు. అయితే నిత్యం తనిఖీలు చేసే విజిలెన్స్ అధికారులకు ఇది కంట పడకపోగా, ఏసీబీకి చిక్కడం గమనార్హం. కాగా, కృష్ణ ఏసీబీకి చిక్కాడనే సమాచారం తెలియగానే ఆర్‌ఎల్‌సీ అరుణకుమారి గురుకుల పాఠశాలకు వచ్చి, సీనియర్ ఉపాధ్యాయుడికి ఇన్‌చార్జ్ బాధ్యతలు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment