వివాదాస్పదంగా మారిన ప్రేమికుల వ్యవహారం
పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన
పాల్వంచ: ఇద్దరు ప్రేమికుల ప్రేమ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. ఆదివారం సాయంత్రం పోలీసుల అదుపులో ఉన్న అమ్మాయిని, అబ్బాయికి అప్పగించాలంటూ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగడంతో డీఎస్పీ సతీష్‌కుమార్ నచ్చజెప్పి సర్దుమనిపించారు. స్థానికుల కథనం ప్రకారం.. పట్టణంలోని కాంట్రాక్టర్స్ కాలనీకి చెందిన యువతి, ఎర్రగుంటకు చెందిన యువకుడు కలిసి ఈనెల 16వ తేదీన ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. కాగ, ఈ విషయంపై యువతి తల్లిదండ్రులు మిస్సింగ్ అయిందని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు హైదరాబాద్‌లో ఉన్న ఆమెను వెతికి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అయితే యువకుడి బంధువులు, స్నేహితులు, గ్రామస్తులు కొంత మంది కలిసి అమ్మాయిని అబ్బాయికి అప్పగించాలని, వారికి వివాహం జరిగిదంటూ ఆందోళనకు దిగారు. స్టేషన్ ఎదుట ఎస్‌ఐ రాఘవయ్య, సిబ్బందితో వాదోపవాదాలకు దిగి ధర్నా చేశారు. దీంతో డీఎస్పీ సతీష్‌కుమార్ అక్కడకు చేరుకుని అమ్మాయిని సోమవారం జడ్జి ముందు ప్రవేశపెడతామని, ఎవరి దగ్గరకు వెళ్తే వారి వద్దకు భద్రత ఇచ్చి పంపిస్తామని చెప్పడంతో సద్దుమణిగింది. ఈ విషయమై డీఎస్పీని వివరణ కోరగా.. 16వ తేదీన 19 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఫిర్యాదురావడంతో ఆమెను రెండు టీంల ద్వారా వెతికి తీసుకొచ్చామని, ఆమె ఒకసారి తానే వెళ్లానని, మరోసారి యువకుడే తీసుకెళ్లాడని చెబుతుందని, జడ్జి ముందు ప్రవేశపెట్టి ఆమె ఇష్టానుసారంగా పంపిస్తామని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment