రామదాసు మండపంలో రాపత్తు సేవ
భద్రాచలంటౌన్ : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న అధ్యయనోత్సవాల్లో భాగంగా స్వామివారికి సోమవారం రామదాసు మండపంలో రాపత్తు సేవ నిర్వహించారు. స్వామివారి ఉత్సవ మూర్తులను మంగళవాయిద్యాలు, శ్రీరామ నామస్మరణల నడుమ పల్లకీ సేవగా పురవీధుల్లో ఊరేగింపుగా అంబసత్రానికి తీసుకెళ్లారు. అర్చకులు, వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారికి నివేదన, హారతి సమర్పించారు. స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ దంపతులు రాపత్తు సేవలో పాల్గొన్నారు.
రామయ్యకు ముత్తంగి అలంకరణ
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం స్వామివారిని ఈ రూపంలో అలంకరించడం ప్రత్యేకత. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం జరిపించారు. అనంతరం స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్య కల్యాణ వేడుకను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. భక్తులు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
ఆలయంలో అంతర్గత బదిలీలు..
శ్రీసీతారామచంద్ర స్వామివారి ఆలయంలో విధులు నిర్వహిస్తున్న పది మంది ఉద్యోగులను అంతర్గతంగా బదిలీ చేస్తూ ఈఓ రమాదేవి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సీనియర్ అసిస్టెంట్లు శ్రీనివాసరెడ్డిని ప్రొటోకాల్, గోశాల పర్యవేక్షులుగా, ఎం.బాలాజీని అన్నదాన ఇన్‌చార్జ్‌గా బదిలీ చేశారు. మరో సీనియర్ అసిస్టెంట్ ఎం.కృష్ణస్వామితో పాటు జూనియర్ అసిస్టెంట్లు స్వర్ణకుమారి, రాకేష్, రికార్డ్ అసిస్టెంట్ శ్రీనివాసరావు, ఆగారెడ్డి, కుమారి, అటెండర్ గోపాలకృష్ణను ఇతర విభాగాలకు బదిలీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment