వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలి
● మాతాశిశు సంరక్షణ అధికారి చైతన్య
మణుగూరు రూరల్ : వైద్యులు, సిబ్బంది నిత్యం సమయపాలన పాటించాలని మాతా శిశు సంరక్షణ అధికారి డాక్టర్ చైతన్య సూచించారు. మణుగూరు మున్సిపాలిటి పరిధిలోని శివలింగాపురంలో గల మణుగూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం ఆయన తనిఖీ చేశారు. సిబ్బంది హాజరుపట్టిక, రికార్డులు, ఈడీడీ క్యాలెండర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే పేషంట్లకు మెరుగైన సేవలు అందించాలని అన్నారు. సాధారణ ప్రసవం పొందిన అనిత అనే మహిళతో మాట్లాడి సేవలు ఎలా అందుతున్నాయని ఆరా తీశారు. ఆస్పత్రిలో సాధారణ కాన్పులు అయ్యేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో పీహెచ్‌సీ వైద్యులు నిశాంత్‌రావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.
అన్‌ఫిట్ కార్మికుల వారసులకు నియామక పత్రాలు
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కొత్తగూడెం ఏరియాలో కొంతకాలం పనిచేసి, ఆనారోగ్య కారణాలతో మెడికల్ ఇన్‌వాలిడేషన్ అయిన కార్మికుల పిల్లలకు ఏరియా జనరల్ మేనేజర్ ఎం. శాలేంరాజు సోమవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంస్థ కల్పించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని సూచించారు. గైర్హాజరు లేకుండా పనిచేసి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని, భవిష్యత్‌లో సంస్థ నిర్వహించే ఇంటర్నల్ పరీక్షల్లో రాణించి ఉన్నత ఉద్యోగాలు సాధించాలని ఆకాంక్షించారు. విధి నిర్వహణలో అంకిత బావంతో పనిచేయాలని, అధికారులు సూచించిన రక్షణ సూత్రాలను పాటించాలని అన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఓ టు జీఎం కోటిరెడ్డి, సీనియర్ పీఓ మురళి, యూనియన్ నాయకులు ఎండీ రజాక్, వి.మల్లికార్జున్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఎకరాకు రూ.21లక్షలు
● ‘సీతారామ’ కెనాల్ నిర్వాసితులకు పరిహారం
ఏన్కూరు: సీతారామ ఎత్తిపోతల పథకంలో భాగంగా లింక్ కెనాల్ నిర్మాణంలో భూమి కోల్పోతున్న రైతులకు ఎకరాకు రూ.21 లక్షలు పరిహారం చెల్లించనున్నారు. ఏన్కూరు, జూలూరుపాడు మండలాల్లోని పలువురు రైతుల భూముల్లో కెనాల్ నిర్మాణం చేపట్టారు. అయితే, పరిహారం విషయమై తేల్చకపోవడంతో రైతులు మంత్రులు, ఎమ్మెల్యేలకు వినతిపత్రాలు ఇస్తున్నారు. ఈనేపథ్యాన ఎకరాకు రూ.21లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రైతులు వైరాలో సోమవారం ఎమ్మెల్యే రాందాస్‌నాయక్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీతారామ కెనాల్‌కు భూములకు ఇచ్చిన రైతులను ఎన్నటికీ మరిచిపోమని చెప్పారు.
3.50లక్షల క్వింటాళ్ల ధాన్యం కొనుగోళ్లు
ఖమ్మంవ్యవసాయం: జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ(డీసీఎంఎస్) ద్వారా ఉమ్మడి జిల్లాలో ఇప్పటి వరకు రూ.99 కోట్ల విలువైన 3.50 లక్షల క్వింటళ్ల ధాన్యం కొనుగోలు చేశామని చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు వెల్లడించారు. ఖమ్మంలోని డీసీఎంఎస్ కార్యాలయంలో సోమవారం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖమ్మం జిల్లాలోని 29కేంద్రాల ద్వారా 2.56 లక్షల క్వింటాళ్లు, భద్రాద్రి జిల్లాలోని 11కేంద్రాల ద్వారా 94వేల క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఇంకా ఎవరైనా రైతుల వద్ద ధాన్యం ఉంటే డీసీఎంఎస్ కేంద్రాల్లో త్వరగా విక్రయించుకోవాలని సూచించారు. పాలకవర్గ సభ్యులు పరుచూరి రవికుమార్, జక్కుల లక్ష్మయ్య, కుంచపు వెంకటేశ్వర్లు, తోళ్ల కోటయ్య, మారుతి ఎట్టయ్య, డీసీఎంఎస్ బిజినెస్ మేనేజర్ కె.సందీప్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment