‘పది’లో ఫలితం దక్కేనా ?
● గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో విద్యార్థుల వెనుకబాటు.. ● నేటి నుంచి పాఠశాలల్లో ప్రత్యేక పరీక్షలు ● ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్స్ నిర్వహించే అవకాశం
నేటి నుంచి స్పెషల్ టెస్ట్‌లు..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు మంగళవారం నుంచి ప్రత్యేక పరీక్షలు జరుగనున్నాయి. ఉదయం యథావిధిగా తరగతులు నిర్వహించాక మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు ఈ పరీక్షలు ఏర్పాటు చేశారు. 21న తెలుగు, 22న హిందీ, 23న ఇంగ్లిష్, 24న గణితం, 25న ఫిజికల్ సైన్స్, 27న బయాలజికల్ సైన్స్, 28న సాంఘిక శాస్త్రం పరీక్షలు జరుగనున్నాయి. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గతంలో ప్రత్యేక పరీక్షల సమయంలో విద్యార్థులకు స్నాక్స్ అందించగా ప్రస్తుతం వాటికి నిధులు కేటాయించలేదు. దీంతో స్వచ్ఛంద సంస్థల వారెవరైనా సమకూరుస్తారా అని విద్యార్థులు ఎదురుచూస్తున్నారు.
కొత్తగూడెంఅర్బన్: ఉపాధ్యాయుల నిర్లక్ష్యం, ప్రధానోపాధ్యాయుల పర్యవేక్షణ లోపం, ఎస్‌ఎస్‌ఏ ఉద్యోగుల సమ్మె తదితర కారణాలతో పలు పాఠశాలలు, కేజీబీవీల్లో పదో తరగతి విద్యార్థులకు ఇబ్బందులు తప్పేలా లేవు. మార్చిలో వార్షిక పరీక్షలు జరుగనుండగా సిలబస్ పూర్తి చేసి జనవరి 10 నుంచి సబ్జెక్టుల వారీగా రివిజన్ చేపట్టాల్సి ఉంది. కానీ పలు పాఠశాలల్లో గణితం, సైన్స్ సబ్జెక్టుల్లో ఇప్పటివరకు సిలబసే పూర్తి కాలేదు. ఈ ప్రభావం ఫలితాలపై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది సబ్జెక్టు టీచర్ల కొరత కారణంగా పదో తరగతి విద్యార్థులకు పూర్తి స్థాయిలో బోధన జరగలేదు. దీంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయారు. ఈ ఏడాది కొత్తగా జిల్లాకు 421 మంది ఉపాధ్యాయులు వచ్చారు. అయితే వారి సేవలను సద్వినియోగం చేసుకోవడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు విఫలం చెందారనే ఆరోపణలున్నాయి. పదో తరగతి విద్యార్థులకు నవంబర్ నుంచే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు జరుగుతున్నా కీలకమైన సబ్జెక్టుల్లో వెనుకబడడంతో ఫలితాలు ఎలా ఉంటాయోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే నెలలో ప్రీ ఫైనల్ పరీక్షలు..
జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఈ ఏడాది 12,484 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరికి మంగళవారం నుంచి ప్రత్యేక పరీక్షలు నిర్వహించేలా విద్యాశాఖ అధికారులు షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరిలో ప్రీ ఫైనల్ పరీక్షలు, మార్చిలో వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. ఇలా వరుస పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకు నిపుణులతో ప్రత్యేక తరగతులు బోధించాలని పలువురు సూచిస్తున్నారు. పరీక్ష సమయంలో ఎలా ఉండాలి, ఆహార నియమాలు ఎలా పాటించాలనే విషయాలపై అవగాహన కల్పిస్తే విద్యార్థులకు కొంత ఉపయుక్తంగా ఉంటుందని అంటున్నారు. ఇంటర్ విద్యార్థులకు ఇప్పటికే ఇలాంటి తరగతులు బోధిస్తుండగా, పదో తరగతి విద్యార్థులకు కూడా చెప్పించాలని కోరుతున్నారు.
పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మంగళవారం నుంచి స్పెషల్ టెస్ట్‌లు జరుగనున్నాయి. అందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో సిలబస్ పూర్తయింది. పూర్తి కాని పాఠశాలల సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటాం. మంచి ఫలితాలు రాబట్టేందుకు అన్ని విధాలా చర్యలు తీసుకున్నాం.
– ఎం.వెంకటేశ్వరా చారి, డీఈఓ
Comments
Please login to add a commentAdd a comment