గాడి తప్పుతున్న స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ
● చేయి తడిపితే చాలు.. ఎలాగైనా సరే రిజిస్ట్రేషన్లు
● ఒప్పందం కుదరకపోతే మాత్రం ససేమిరా
● శాఖ ఉద్యోగులపై మంత్రి పొంగులేటికి ఫిర్యాదుల వెల్లువ
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ఉమ్మడి జిల్లాలోని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖలో కొందరు ఉద్యోగుల తీరు గాడి తప్పుతోంది. కొద్ది కాలంగా పలువురు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. నిబంధనలను పక్కన పెట్టి ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు చేస్తుండడంతో శాఖ పరువు వీధికెక్కుతోంది. గత ఐదేళ్లలో పలువురు సబ్ రిజిస్ట్రార్లు, ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు మార్గదర్శకాలు, నిబంధనలు పట్టించుకోకుండా ప్రభుత్వ స్థలాలను కూడా రిజిస్ట్రేషన్ చేసేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందడంతో విచారణ చేయించి.. కొందరిపై సస్పెన్షన్ వేటు వేశారు. ఇటీవల కూడా అలాంటి ఘటనలు చోటుచేసుకోవడం, రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచారశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు రాష్ట్ర ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతుండడంతో మంత్రి ఆగ్రహంతో ఉన్నట్లు తెలుస్తోంది.
ఐదేళ్లలో రిజిస్ట్రేషన్ శాఖ ఉద్యోగుల
లీలల్లో కొన్ని..
● గతంలో ఖమ్మం రూరల్ ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన కరుణ నిబంధనలు, మార్గదర్శకాలను పక్కన పెట్టి అక్రమాలకు పాల్పడినట్లు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీకి ఫిర్యాదులు అందాయి. ఆమె ఏదులాపురం రెవెన్యూ 142వ సర్వే నంబర్‌లో ఉన్న ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్న ఫిర్యాదులపై విచారణ చేపట్టగా నిజమేనని తేలడంతో 2021లో సస్పెన్షన్ వేటు వేశారు.
● మధిరలోని సర్వే నంబర్ 6లో ఉన్న 277.77 చదరపు గజాల ఎకై ్సజ్ శాఖ కార్యాలయ స్థలాన్ని 2021 మే 11న గిఫ్ట్ సెటిల్‌మెంట్ స్వాధీన దస్తావేజు కింద ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్ సత్యానందం రిజిస్ట్రేషన్ చేశారు. ఈ ఘటనలో ఆయనను సస్పెండ్ చేశారు. అలాగే, అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తిని అరెస్ట్ చేసి డాక్యుమెంట్‌ను రద్దు చేశారు.
● కూసుమంచిలో నిబంధనలకు విరుద్ధంగా వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. 2022లో కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఇలా జరిగాయి. అనుమతి లేని వెంచర్ల రిజిస్ట్రేషన్‌కు రెగ్యులర్ సబ్‌రిజిస్ట్రార్ అభ్యంతరం చెప్పడంతో రెండు రోజులు ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన సీనియర్ అసిస్టెంట్ కిరణ్ రిజిస్ట్రేషన్లు చేసినట్లు అధికారులు గుర్తించారు.
● సత్తుపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ పరిధిలో నిషేధిత భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారికి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారన్న ఆరోపణలు వచ్చాయి. ఇంటి నంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లు చెబుతున్నారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోనూ డోర్ నంబర్లతో రిజిస్ట్రేషన్లు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
● భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడులో ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా పనిచేసిన వైరా సీనియర్ అసిస్టెంట్ ఖదీర్ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లుగా ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఆయన హ యాంలో డబ్బు వసూలు చేసిన వీడియోలు సంచలనంగా మారాయి. ఆయనే ఇల్లెందు ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరించినప్పుడు ఇలాంటి ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయానికి సరెండర్ చేసి ఆ తర్వాత మరో కార్యాలయంలో పోస్టింగ్ ఇచ్చారు.
● వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో మూడేళ్లలో నలుగురు సబ్ రిజిస్ట్రార్లు బదిలీ అయ్యారు. ఇందులో మూడేళ్ల క్రితం సబ్‌రిజిస్ట్రార్ సత్యానందం.. మధిర ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్‌గా వ్యవహరిస్తూ అక్కడి ఎకై ్సజ్ శాఖ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసి సస్పెన్షన్‌కు గురయ్యాడు. మరో సబ్ రిజిస్ట్రార్ రాంకుమార్ సర్వే నంబర్లు మార్చి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేయడంతో బదిలీ వేటు పడింది. అలాగే, సబ్ రిజిస్ట్రార్ మోహిత్ అలీ రిజిస్ట్రేషన్ విషయంలో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు రావడంతో బదిలీ చేశారు. ఇక్కడే మహిళా సబ్ రిజిస్ట్రార్ ఏన్కూరు మండలంలో గిరిజన భూములు నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసి బదిలీకి గురయ్యారు. తాజాగా రామచంద్రయ్య నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేసి సస్పెన్షన్‌కు గురవడం గమనార్హం. ఇలా వైరా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసిన నలుగురు సబ్ రిజిస్ట్రార్లపై మూడేళ్ల కాలంలో చర్యలు తీసుకున్నారు.
ఆరోపణల వెల్లువ..
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 11 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. ఖమ్మంలో ఆర్‌ఓ కార్యాలయంతో పాటు ఖమ్మం రూరల్, కూసుమంచి, సత్తుపల్లి, వైరా, కల్లూరు, మధిర, కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లెందు, బూర్గంపాడులో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. వీటిలోని కొన్ని కార్యాలయాల్లో అవకతవకలు, నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్లు జరుగుతుండగా.. సబ్ రిజిస్ట్రార్లు, ఇన్‌చార్జ్ సబ్ రిజిస్ట్రార్లు మొదలు డాక్యుమెంట్ రైటర్ల వరకు కీలకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. లింక్ డాక్యుమెంట్లు లేని స్థలాలతో పాటు అనుమతి లేని స్థలాలను రిజిస్ట్రేషన్ చేయొద్దనే నిబంధనలను పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల నాలా కన్వర్షన్ లేని భూములకు సైతం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసిన వ్యవహారంలో వైరా సబ్ రిజిస్ట్రార్ రామచంద్రయ్య సస్పెన్షన్‌కు గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment