● రిటైర్‌మెంట్ వయస్సు పెంపు సరికాదు ● ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి
ఖమ్మంరూరల్: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, 2023 జూలై నుంచి వర్తించేలా పీఆర్‌సీ వర్తింపచేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోని తెల్దారుపల్లి, జలగంనగర్, గొల్లగూడెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలను సోమవారం సందర్శించిన ఆయన ఉపాధ్యాయుల సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్సీ మాట్లాడుతూ ఉద్యోగులు రిటైర్‌మెంట్ వయస్సు పెంచాలనే ఆలోచన ఆర్థిక సమస్యలకు పరిష్కారం చూపదని తెలిపారు. ఈ ప్రతిపాదనను విరమించుకుని పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని, కేజీబీవీ, యూఆర్‌ఎస్, ఆశ్రమ పాఠశాలల కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనం అమలుచేయడమే కాక పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు షేక్ రంజాన్, ఎం.నర్సయ్య, నవీన్‌కుమార్, మహేష్, వై.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment