ఏడు పంచాయతీలను కార్పొరేషన్‌లో కలపొద్దు
సూపర్‌బజార్(కొత్తగూడెం): సుజాతనగర్ మండలంలోని ఏడు పంచాయతీలను కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనం చేయొద్దని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆయా పంచాయతీల ప్రజలు ధర్నా నిర్వహించారు. ఈ పోరాటానికి సీపీఎం సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసాని ఐలయ్య మాట్లాడుతూ అర్బన్ స్వభావం లేని ఏడు పంచాయతీలను కార్పొరేషన్‌లో విలీనం చేస్తే వ్యవసాయ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులు నష్టపోతారని అన్నారు. ఆయా గ్రామాల్లో సుమారు ఐదు వేల మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారని, వారందరికి ఉపాధి పథకం వర్తించదని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అభివృద్ధి చేసేందుకు తమపార్టీ వ్యతిరేకం కాదని అన్నారు. అర్బన్ స్వభావం లేని పల్లె ప్రాంతాలను కార్పొరేషన్‌లో కలపడం వల్ల పేదలు, చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏఓకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతుసంఘం జిల్లా కార్యదర్శి అన్నవరపు సత్యనారాయణ, జిల్లా ఉపాధ్యక్షుడు కున్సోత్ ధర్మ, ఆలిండియా లాయర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు శివరాం ప్రసాద్, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు లిక్కి బాలరాజు, కాలంగి హరికృష్ణ, సీఐటీయూ నాయకులు దొడ్డ రవికుమార్, వీర్ల రమేష్, భూక్య రమేష్, వ్యవసాయ కార్మిక సంఘం, జీఎంపీఎస్, మహిళా సంఘం నాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment