కన్నకూతురునే కడతేర్చబోయాడు..
●ఉరిపెట్టి హత్య చేసేందుకు యత్నించిన తండ్రి ●చనిపోయిందనుకుని వెళ్లిపోయాక మేల్కొని ఇంటికి చేరిన బాలిక ●తల్లి ఫిర్యాదుతో తండ్రిపై కేసు నమోదు
టేకులపల్లి : కన్న కూతురునే కడతేర్చబోయాడో తండ్రి. అదృష్టం బాగుండి గంట తర్వాత తేరుకుని ఇంటికి చేరిన బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. టేకులపల్లి మండలం సంపత్‌నగర్‌కు చెందిన కొర్సా రవి –లక్ష్మి దంపతులకు 8, 9, 10 ఏళ్ల వయసు గల ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వ్యవసాయ కూలీలుగా జీవనం సాగించే ఈ దంపతులు తరచూ గొడవలు పడుతుండేవారు. ఈ క్రమంలో లక్ష్మి రెండేళ్ల పాటు భర్తకు దూరంగా బంధువుల ఇంట్లోనే ఉంది. ఇటీవల గ్రామ పెద్దలు పంచాయితీ నిర్వహించి రవిని మందలించడంతో పాటు లక్ష్మిని భర్త వద్దకు రావాలని సూచించారు. దీంతో లక్ష్మి తిరిగి రాగా, ఇటీవల మళ్లీ గొడవలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఈనెల 13న మద్యం సేవించిన రవి భార్యపై కోపంతో చిన్నకూతురు సాహిత్యకు చాక్లెట్ కొనిస్తానంటూ ఊరి బయట ఉన్న జామాయిల్ తోటలోకి తీసుకెళ్లి చెట్టుకు టవల్‌తో ఉరి పెట్టాడు. కనుగుడ్లు బయటకు వచ్చి బాలిక కదలకుండా ఉండడంతో చనిపోయిందనుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. గంట తర్వాత మేల్కొన్న బాలిక ఇంటికి వచ్చి ఈ విషయం తల్లికి చెప్పింది. దీంతో భార్యతో పాటు గ్రామస్తులంతా రవిని నిలదీశారు. అయినా మార్పు రాకపోవడంతో లక్ష్మి మండలంలోని బోడు పోలీసు స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రవిపై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ పొడిశెట్టి శ్రీకాంత్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment